తిరుమలకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి సరఫరా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వస్తుంటాయి. వేల కోట్లు ఖర్చు చేసి బయట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు 75లక్షల విలువ చేసే ల్యాబు కూడా తిరుమల కొండపై లేదన్న సంచలన విషయాలను ఈవో వెల్లడించారు. స్వామి వారికి అందించే ప్రసాదాలతో పాటు, లడ్డూ తయారీలో వాడుతున్న నెయ్యిపై ప్రధానంగా ఫిర్యాదులు వచ్చాయి. ఆ నెయ్యిని పరిశీలిస్తే… నూనెలాగే ఉంది. 320రూపాయలకు కిలో నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అనుమానం వచ్చింది. దీంతో ఆ సంస్థ నుండి వచ్చిన 4 లారీల్లో నెయ్యిని శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపగా… జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని ఈవో శ్యామలరావు వెల్లడించారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ కంపెనీ దీన్ని సప్లై చేస్తుంది. దీంతో ఆ కంపెనీ నెయ్యిని నిలిపివేయటంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టేందుకు చర్యలు చేపట్టామని ఈవో ప్రకటించారు. అన్ని రకాల పరీక్షలు చేయగా… ఎందులోనూ ఆ నెయ్యి సరైన ఫలితాలు లేవని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూ నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. ఇటీవలే ప్రభుత్వ అనుమతితో గతంలో టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన కర్నాటక ప్రభుత్వరంగ డెయిరీ నందిని డెయిరీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. నెయ్యి సప్లైపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. తిరుమలలో ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని… డిసెంబర్ నాటికి సొంతగా టీటీడీ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తుందని ఈవో ప్రకటించారు.