గుంటూరులోని మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కోనేరు లో అద్భుతం బయట పడింది. దాదాపు 5 అడుగులు వెడల్పున్న ఓ సొరంగం అందరిని విస్తుపోయేలా చేసింది.. పూర్తిగా బురదతో కూడిన నీటితో నిండి ఉన్న ఈ సొరంగం ఇప్పటి వరకు ప్రచారం లో ఉన్న ఓ కథనాన్ని నిజమని నిరూపిస్తోంది.. చేబ్రోలు బ్రహ్మగుడి వరకూ సొరంగమార్గం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. సొరంగంలోని బురదను, నీటిని తొలగిస్తున్నారు. పూర్తి స్థాయిలో బురదను తొలగించిన అనంతరం సొరంగం లోపల ఏముంది, ఎక్కడ వరకూ వెళ్ళవచ్చు అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పానకాల స్వామి ఆలయ సిబ్బంది వెల్లడించారు. దీంతో మరుగున పడిన చరిత్ర మరోసారి వెలుగులోకి రానుంది.. శ్రీ చక్రం ఆకారంలో ఉన్న కోనేరుఅభివృద్ధి లో భాగంగా అనేక నిర్మాణాలు బయటపడుతూ అందరిని ఆశ్ఛర్యానికి గురిచేస్తున్నాయి. గత కొంతకాలంగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయం ఎదురుగా ఉన్న చీకటి కోనేరులో ఇప్పటికే అరుదైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట కోనేరు పడమర గోడపై ఆంజనేయ స్వామి దేవాలయం బయటపడింది. ఆలయం ఎదుట ధ్వజ స్తంభం కూడా ఉంది. ఈశాన్య మూలలో రెండు శివలింగాలు బయటపడ్డాయి. తూర్పు మెట్లపై శివలింగాకార తోరణాల మెట్లు వెలుగు చూశాయి. ప్రాచీన ఆలయాల్లో కోనేరు ఉండటం సాధారణం. దేవాలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలకు అవసరమయ్యే నీటి కోసమే కాకుండా భక్తుల పుణ్యస్నానాలు, ఉత్సవాల్లో కోనేరును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు నిర్మాణం వెనుక ఆసక్తికర కథనం ఉంది. చీకటి కోనేరుగా పిలుచుకునే ఈ కట్టడం ఆలయ గాలిగోపురం ఒరిగిపోకుండా సమతుల్యత కోసం నిర్మించడం ఇక్కడి విశిష్టత. ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో పాండవులు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల హయాంలో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్టు చరిత్ర చెబుతోంది. 1807-09 మధ్య కాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతోపాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తైందిగా చెబుతారు. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తున్న ఈ గోపురం పీఠభాగాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. గోపురం నిర్మాణం పూర్తైన తర్వాత వెనుకవైపునకు ఒరుగుతున్నట్టుగా శిల్పులు గుర్తించారు. అది నిలదొక్కుకునేందుకుకంచి నిపుణుల సలహాతో గాలి గోపురం ఎత్తుకు సమాన లోతుతో ఎదురుగా కోనేరును తవ్వారు. లోతుగా తవ్విన కారణంగా లోపలికి దిగితే చీకటిగా ఉండేది. దీంతో ఆ కోనేరుకు చీకటి కోనేరుగా పేరొచ్చింది. చీకటి కోనేరులో నీరు ఎక్కువగా రావడంతో అందులోని వినాయ విగ్రహం మునిగిపోయింది. కోనేరులోని నీటిని ఆలయంలోని పూజా కార్యక్రమాలకు వినియోగించేవారు. దివిసీమ ఉప్పెన తర్వాత కోనేరు శిథిలమైపోయింది. నిర్వహణ లేకపోవడంతో దాని చుట్టూ గోడను నిర్మించి వదిలేశారు. ఈ ఆలయానికి సంబంధించి పట్టణంలో పెద్ద కోనేరు కూడా ఉంది. అప్పట్లో ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి చక్రస్నానంతో పాటు తెప్పోత్సవం పెద్ద కోనేరులో నిర్వహించేవారు. కోనేరులో నీరు పాడవడంతో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం నిలిపేశారు. ఈ నేపథ్యంలో చీకటి కోనేరును మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన దేవాలయంగా మరియు లక్ష్మీ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం రాజకీయాలకు వేదికగా మారింది, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆనుకొని ఉన్న పెద్ద కోనేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా వార్తల్లో ఉంది. ఈ కోనేరు పునర్నిర్మాణం కొరకు ప్రభుత్వం కోటిన్నర రూపాయలు వెచ్చించి మరమ్మత్తులు నిర్వహిస్తుంది, నిర్మాణ పనుల్లో భాగంగా నీటిని తోడి, పూడిక తీయాలని నిర్ణయించి ఆ పనులు జరుగుతుండగా, కోనేటి అడుగు భాగంలో గుప్త నిధులు ఉన్నాయని ఒక వర్గం చెబుతుంది. అయితే ఇంత పురాతన కోనేటిని మరమ్మతులు చేసేటప్పుడు సీసీటీవీ తో భద్రత కల్పించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో, నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు నిర్వహిస్తే పారదర్శకంగా ఉంటుందని కొంత మంది చేస్తున్న డిమాండ్ ను ఎవరు పట్టించుకోలేదు. 1970 వరకూ ఈ కోనేటిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేవారు. స్వామివారిని దర్శించుకునే వారు శిథిలావస్థకు చేరిన కోనేరు డంపింగ్ యార్డుగా మారిపోయింది. కోనేటి నిర్మాణాలు కూలిపోయాయి. నీరు కూడా పైవరకూ చేరుకుంది. వాస్తవానికి 30 ఏళ్ల క్రితం కోనేరు అభివృద్ధికి ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. అయితే నీళ్లు తగ్గిపోతున్న కొద్దీ అనేక నిర్మాణాలు బయటపడుతున్నాయి. వీటిని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటికే 120 అడుగుల వరకూ వెళ్ళారు. ఇంకా అడుగున బావి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే కోనేరు చతుర్భుజా, షడ్బుజా అర్థం కావటం లేదు. కానీ భక్తులు మాత్రం శ్రీ చక్రం ఆకారంలో కోనేరును నిర్మించారని చెబుతున్నారు భక్తులు. మొత్తంగా మరో రెండు నెలల్లో పునర్‌నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కోనేరును వాడుకలోకి తీసుకురావడమే కాకుండా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.