‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతున్న పుష్ప రాజ్ తగ్గాల్సిన అవసరం వచ్చినట్లే కనిపిస్తుంది… ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మార్పు పుష్ప దూకుడికి అడ్డం పడే అవకాశం ఉండడం తో మేకర్స్ వాయిదా తో దిద్దుబాటు చర్యలు మొదలెట్టేసారని ఫిల్మ్ నగర్ టాక్… మెగాఫ్యామిలీ నుంచి బయటకు రావాలని అల్లు వారబ్బాయి కి ఎందుకో చెప్పలేనంత ఆశ. మెగా ఫ్యామిలీ లో అయితే ఎప్పటికి ఫ్లవర్ లాగే ఉండాలని, ఫైర్ అవ్వాలంటే బయటకు రావాల్సిందే అని గట్టిగా అనుకున్న అల్లు అర్జున్ ఆ బ్రాండ్ కోసం కొన్నాళ్ల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు.. దాన్ని ఎవరు తప్పు పట్టలేదు. మెగాఫ్యామిలీ నుంచి ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే కేవలం ఒక్క ట్వీట్ వదిలి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళడం తో జనసేన కార్యకర్తలే కాదు.. మెగాఫ్యామిలీ అభిమానులు కూడా భగ్గుమన్నారు. మిత్రుడికి మాట ఇచ్చాను అందుకే ప్రచారానికి వెళ్ళాను అని అల్లు అర్జున్ ఇచ్చిన వివరణ తో ఎవ్వరు సంతృప్తి చెందలేదు. కొందరైతే అల్లు అర్జున్ సినిమాలు అడనివ్వబోమని.. ఆడ్డుకుంటామని వార్నింగ్ లు ఇచ్చేసారు.. కొందరు ఇంకాస్త ఎక్కువ చేసి డోస్ పెంచారు. జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ పై అల్లు అర్జున్ అభిమానులు దాడి చేయడం కూడా వైరల్ అయింది.. మైత్రి మూవీ మేకర్స్ కి సన్నిహితులైన గొట్టిపాటి రవికుమార్ ఏపీ మంత్రి వర్గం లో ఉన్నప్పటికీ సినిమాటోగ్రఫీ శాఖను కందుల దుర్గేష్(జనసేన) చూడటం తో ఏమైనా చిక్కులు వుండొచ్చా అన్న ముందు చూపు తో పరిస్థితులు సానుకూల పడితే అప్పుడు అన్నీ సర్ధుకుంటాయి అన్న ధోరణి లో మేకర్స్ లాంగ్ పోస్ట్ పోన్ చేశారన్నది విశ్వసించదగ్గ సమాచారం. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తున్నామని ప్రకటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. షూటింగ్ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలనే వుద్దేశంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ లోపల మేటర్ ఇంకా ఎక్కువే ఉందన్నది విశ్లేషకులు మాట.. డబ్బు మంచినీళ్ల లాగ ఖర్చు పెడుతున్న పుష్ప టీమ్ దానికి తగ్గ కలెక్షన్స్ రావాలంటే విత్ అవుట్ ఆంధ్రప్రదేశ్ ని అస్సలు ఊహించుకోలేం.. అందుకే అన్నింటితో పాటు ఆంధ్రా కలెక్షన్స్ కూడా ముఖ్యమే అన్న కోణం తో లాంగ్ పోస్ట్ పోన్ అన్నది అసలు విషయం అన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.