ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వడగాల్పులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. జనాలు బయట తిరిగేందుకు భయపడుతున్నారు. 42 నుంచి 47 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక పక్క వేడి , మరోపక్క తీవ్ర వడగాల్పులు ప్రజలను భయపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ నెల 15, 16 అంటే సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు ఈ పరిస్థితి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇదే విషయాన్ని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఉంది.ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. మంగళవారం కూడా 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు. సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక తెలంగాణాలో సైతం ఉక్కపోత వాతావరణం నెలకొంది. సింగరేణి గనుల్లో కార్మికులు అల్లాడిపోతున్నారు. మంచిర్యాల జిల్లా కొండాపూర్ లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.