ఆర్నాబ్ తుపాన్ తీరం దాటిందన్న వార్త ఇంకా పూర్తిగా అందరికి చేరక ముందే మరో అల్పపీడనం విరుచుకు పడబోతోందని అది తీవ్ర వాయుగుండమై తుపాను గా పయనిస్తోందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపధ్యంలో అల్పపీడనం ఏర్పడటం అది వాయుగుండంగా మారడం..? తుపానుగా మారి తీర ప్రాంతాలను ముంచెత్తడం..? ఏంటీ వ్యత్యాసాలు అనే ప్రశ్నలు ప్రజల్ల తలెత్తుతున్నాయి. వాతావరణ హెచ్చరికలలో తరచుగా వినిపించే ఈ మూడు పదాలు ఒకే ప్రక్రియలోని వేర్వేరు దశలను సూచిస్తాయి. అయితే వీటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలంటే వాతావరణ పీడనం, గాలుల కదలిక, సముద్ర ఉష్ణోగ్రత, తుపాను తీవ్రత వంటి అంశాలను తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో అల్పపీడనం నుంచి తుపాను వరకు సాగే వాతావరణ పరిణామాలను శాస్త్రీయంగా పరిశీలిద్దాం.
అల్పపీడనం అంటే ఏమిటి?
వాతావరణంలో ఒక ప్రాంతంలో గాలి పీడనం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పుడు దానిని అల్పపీడన ప్రాంతం అంటారు. సాధారణంగా భూమి ఉపరితలంపై గాలి వేడెక్కినప్పుడు తేలికగా మారి పైకి లేస్తుంది. దీంతో భూమి ఉపరితలం వద్ద పీడనం తగ్గుతుంది. ఈ పీడన వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గాలి అల్పపీడన కేంద్రం వైపు కదులుతుంది. ఈ ప్రక్రియలో గాలి పైకి లేచి చల్లబడటం, నీటి ఆవిరి మేఘాలుగా మారడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. తగిన వాతావరణ పరిస్థితులు ఉంటే వర్షాలు కురుస్తాయి. సముద్ర ఉపరితలంపై అధిక ఉష్ణోగ్రతలు ఉండటం. గాలిలో తేమ అధికంగా ఉండటం. వాతావరణంలో గాలి పైకి లేచే పరిస్థితులు ఏర్పడటం. భూమి భ్రమణం, గాలుల కదలికల ప్రభావం. గాలి పీడనం తగ్గి, చుట్టుపక్కల నుంచి గాలి చేరడం. వంటివి అల్పపీడన కారణాలు. అల్పపీడనం ఏర్పడిన ప్రతిసారీ అది తుపానుగా మారుతుందని అనుకోలేం చాలా అల్పపీడనాలు వర్షాలు కురిపించి బలహీనపడతాయి. కొన్ని మాత్రమే మరింత బలపడి వాయుగుండాలుగా, ఆ తర్వాత తుపానులుగా మారుతాయి.
భారతదేశంలో ముఖ్యంగా నైరుతి, ఈశాన్య రుతుపవనాల సమయంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడటం సాధారణం.
వాయుగుండం అంటే ఏమిటి.?
భారత వాతావరణ శాఖ (IMD) వర్గీకరణ ప్రకారం, అల్పపీడన వ్యవస్థలో గరిష్ఠంగా నిరంతరంగా వీచే గాలుల వేగం గంటకు 31 కిలోమీటర్లకు చేరినప్పుడు అది వాయుగుండం (Depression) దశలోకి ప్రవేశిస్తుంది. వాయుగుండం ఏర్పడినప్పుడు సాధారణంగా గాలుల వేగం పెరుగుతుంది.
మేఘాల సమూహం మరింత వ్యవస్థీకృతంగా మారుతుంది.
విస్తారమైన ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సముద్రంలో అలలు ఎగసిపడతాయి. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ముప్పు పెరుగుతుంది వాయుగుండం మరింత బలపడితే దానిని తీవ్ర వాయుగుండం అంటారు. అయితే వాయుగుండం అనేది తుపానుకు పర్యాయపదం కాదు. ఇది తుపానుగా మారే ముందు ఉండే ఒక ముఖ్యమైన దశ.
తుపాను అంటే ఏమిటి?
సముద్రంపై ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ బలపడుతూ, దాని చుట్టూ వీచే గాలుల వేగం గంటకు 62 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువకు చేరినప్పుడు భారత వాతావరణ శాఖ దానిని తుపాను (Cyclonic Storm) గా వర్గీకరిస్తుంది. తుపాను అనేది కేవలం బలమైన గాలుల సమూహం మాత్రమే కాదు. ఇది ఒక వ్యవస్థీకృత వాతావరణ వ్యవస్థ. దీనిలో కేంద్రంలో అల్పపీడనం, దాని చుట్టూ వేగంగా తిరిగే గాలులు, భారీ మేఘాలు, వర్షాలు ఉంటాయి. తుపాను ఏర్పడటానికి సముద్రం నుంచి నిరంతరంగా శక్తి అందాలి. సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండటం అనుకూల పరిస్థితిగా పరిగణిస్తారు. అయితే ఉష్ణోగ్రత ఒక్కటే తుపాను ఏర్పాటుకు సరిపోదు. గాలిలో తేమ, వాతావరణ అస్థిరత, పైస్థాయిలో గాలుల మార్పులు వంటి అంశాలు కూడా కీలకం. తుపాను మధ్యలో ఉండే ప్రాంతాన్ని తుపాను కన్ను గా భావిస్తారు.. బలమైన తుపానుల్లో ఇక్కడ తాత్కాలికంగా గాలులు తక్కువగా, ఆకాశం ప్రశాంతంగా ఉండవచ్చు. తుపాను కన్ను చుట్టూ ఉండే అత్యంత శక్తివంతమైన మేఘాల వలయం. ఇక్కడే అత్యంత బలమైన గాలులు, తీవ్రమైన వర్షాలు ఉంటాయి.తుపాను కేంద్రం చుట్టూ చుట్టుకుంటూ ఉండే మేఘాల సమూహాలను స్పైరల్ రైన్ బెండ్స్అంటారు. వీటి వల్ల తుపాను కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి.
తుపాను తీవ్రత పెరిగే కొద్దీ దాని ప్రభావం విస్తరిస్తుంది. తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు భూమిపైకి చొచ్చుకురావడం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఇళ్లు దెబ్బతినడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. వాతావరణ శాఖ తెలిపే గాలుల వేగం అంటే కొన్ని సెకన్లపాటు వీచే గాలుల గరిష్ఠ వేగం కాదు. నిర్దిష్ట కాలవ్యవధిలో నమోదయ్యే నిరంతర గాలుల సగటు వేగం ఆధారంగా తుపాను తీవ్రతను నిర్ణయిస్తారు. ఒక్కసారిగా వీచే గాలుల వేగం (Gusts) దీనికంటే ఎక్కువగా ఉండవచ్చు. తుపానులకు సముద్రం ఒక ఇంధన కేంద్రం లాంటిది. సముద్ర ఉపరితలంపై వేడి పెరిగినప్పుడు నీరు ఆవిరిగా మారుతుంది. ఈ నీటి ఆవిరి పైకి లేచి చల్లబడినప్పుడు మేఘాలు ఏర్పడతాయి. నీటి ఆవిరి మేఘాలుగా మారే ప్రక్రియలో విడుదలయ్యే గుప్తోష్ణం (Latent Heat) తుపాను వ్యవస్థకు శక్తిని అందిస్తుంది. ఈ శక్తితో గాలులు మరింత వేగంగా కదులుతాయి. గాలుల వేగం పెరిగేకొద్దీ సముద్రం నుంచి మరింత తేమను గ్రహించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనుకూల పరిస్థితుల్లో తుపాను బలపడుతుంది. అయితే సముద్రం వేడిగా ఉన్నంత మాత్రాన తుపాను ఏర్పడదు. వాతావరణంలో గాలుల నిలువు కోత (Vertical Wind Shear) ఎక్కువగా ఉంటే తుపాను నిర్మాణం దెబ్బతినవచ్చు. భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో భూమి భ్రమణ ప్రభావం కూడా తుపాను ఏర్పాటుకు తగినంతగా ఉండకపోవచ్చు. సముద్రంపై ఏర్పడిన తుపాను భూమిపైకి ప్రవేశించినప్పుడు దాని తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే తుపాను తీరం దాటిన వెంటనే ప్రమాదం ముగిసినట్లు కాదు. తుపాను బలహీనపడినా భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు కొనసాగవచ్చు. కొన్ని సందర్భాల్లో తుపాను అవశేషాలు భూమిపైకి ప్రవేశించిన తర్వాత కూడా వర్షాలను కురిపిస్తూ వాతావరణంపై ప్రభావం చూపుతాయి.
తుపానులకు పేర్లు ఎందుకు పెడతారు?
తుపానులకు పేర్లు పెట్టడం వల్ల ప్రజలకు హెచ్చరికలు అందించడం, సమాచారాన్ని సులభంగా గుర్తించడం, ఒక తుపానును మరొక తుపాను నుంచి వేరు చేయడం సులభమవుతుంది. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుపానులకు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఐక్యరాజ్యసమితి ఆసియా-పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (ESCAP) పరిధిలోని తుపానుల కమిటీ సభ్య దేశాలు సూచించిన పేర్ల జాబితా ఆధారంగా పేర్లు కేటాయిస్తారు.
ప్రతి అల్పపీడనానికి లేదా వాయుగుండానికి పేరు పెట్టరు. తుపాను స్థాయికి చేరినప్పుడు మాత్రమే అధికారికంగా పేరు కేటాయిస్తారు. రాబోయే పది తుపాన్లకు పేర్లను వివిధ దేశాల ప్రతిపాదనల ద్వారా ఇప్పటికే నిర్ణయించారు. వాటిని పరిశీలిస్తే మురసు (భారత్), అక్వాన్ (ఇరాన్), కాని(మాల్దీవులు),ఎంగామాన్(మయన్మార్), సైల్(ఒమన్), సహాబ్(పాకిస్తాన్),లులు(ఖతర్), రజీర్ (సౌదీ అరేబియా), గిగుమ్(శ్రీలంక), ధిన్యోట్(థాయిలాండ్), గా నిర్ణయించారు.
వాతావరణ వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించడం, అధికారుల సూచనలను పాటించడం ద్వారా తుపానుల వల్ల కలిగే ప్రమాదాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.