సృష్టి, స్థితి లయ కారులైన త్రిమూర్తులలో అసలు బ్రహ్మ ఎవరో అన్న సందేహం వచ్చిన ఋషులు దానిని నివృత్తి చెయ్యాలని మళ్లీ త్రిమూర్తులనే అడిగారట.. అయితే వాళ్ళమధ్య ఏకాభిప్రాయం లేక వాళ్లలో వాళ్లే తామే బ్రహ్మ అని చెప్పడంతో వేదాలని పిలిచి అడిగితే నాలుగు వేదాలు తలో రకమైన విశ్లేషణ చేసి చెప్పాయి దానికి సంతృప్తి చెందని త్రిమూర్తులు ప్రణవాన్ని ఆహ్వానిస్తే అపుడు ప్రణవం సైతం ఎవరు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరుడై శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో ,అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతిదేవి ని వామార్థ భాగం లో ధరించిన శంకరుడే పరబ్రహ్మ’ అని ప్రణవం చెప్పిన మాటను మిగిలినవాళ్ళు అంగీకరించపోవడంతో పరమేశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మ జ్యోతిగా మారి దర్శనమిచ్చాడు అది చూసిన విష్ణువు ఊరుకున్నప్పటికి బ్రహ్మ మాత్రం నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు నువ్వే నన్ను స్తుతించాలి అని అహంకారం తో పలుకగా శివాంశ తో ఆవిర్భవించిన జ్యోతి ఘోర రూపమును పొంది ‘శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగడంతో అహంకార పూరితమైన బ్రహ్మ అయిదవ తలను ఛిద్రం చేయు అని చెప్పగా ప్రచండ రూపం పొందిన జ్యోతి స్వరూపం దిగంబరరూపం తొ ,బ్రహ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది. అలా సృష్టించబడిన రూపమే కాలభైరవ స్వరూపం. ఎప్పుడైతే ఆలా జరిగేసరికి బ్రహ్మ భయపడి పోయి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ చర్య ద్వారా బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెగ్గొట్టినందువల్ల బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. అని చెప్పాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు ‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు… కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సూచించడం తో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకున్నాడు ఆ వెంటనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలోనే పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే – నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’. కాలభైరవుని భక్తి కి మెచ్చిన విశ్వనాధుడు కాలభైరవ.. ఎవరైతే ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. ఇకనుంచి నీవు నా దేవాలయ ములన్నింటి లోను నువ్వే క్షేత్ర పాలకుడవయి ఉంటావు..భక్తుల పాపములను తొలగించి వాటిని నువ్వే భక్షించు అలా వారి పాపాలను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరుతో కీర్తింపబడతావు నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు నువ్వే ఈ క్షేత్రానికి పాలకుడవు..’అని చెప్పాడు. అందుకే కాశీ ని దర్శించిన భక్తులు విశ్వనాధుని గర్భాలయంలో కి అనుమతించి పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ప్రసన్నమూర్తి గా తలచి మేడలో ఒక గారెల దండ వేసి కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ చేస్తారు… ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేసేందుక హరిద్వార్, ఋషికేశ్ లలోని మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. కాల భైరవుడు భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం చాలా గొప్పది. నల్లతాడును రక్షతో మనతోనే ఉంటాడు.. కాబట్టి ఇన్ని రూపములుగా ఆవిష్కరింపబడిన ఈ కాలభైరవ స్వరూపము అష్ట రూపాలలో దర్శనమిస్తుంది.. అష్ట కాలభైరవుల గురించి మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం..