ఉత్తర భారతదేశం(North India)లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సహా ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది.. 45 నుంచి 50డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు (High temperature) నమోదు అవుతుండడంతో వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గడచిన 15 సంవత్సరాలలో ఇంత వేడి రాత్రులు లేవని వ్యాఖ్యానిస్తున్నారు… దీంతో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం(IMD) ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ఠంగా 45డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ నెల సగటుతో పోలిస్తే ఇది 6డిగ్రీల అధికం. దీంతో ఎండ వేడిమి, వేడిగాలుల ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడిచిన 72గంటల్లో వడదెబ్బతో 15మంది మృతిచెందారు. వీరిలో ఢిల్లీ ఆర్ఎంఎల్, సఫ్డర్ జంగ్, LNJP ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ ఐదుగురు మృత్యువాత పడ్డారు. నోయిడాలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ RML ఆస్పత్రిలో ఇప్పటికే వడదెబ్బతో 36మంది చికిత్స పొందుతుండగా.. వారిలో లైఫ్ సపోర్ట్‌పై 12మంది రోగులు ఉన్నారు. ఇలాగే వేడిగాలులు కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.