వెహికల్స్ పై మనం రకరకాల స్టిక్కర్స్ ని చూస్తుంటాం చాలామంది తమ హీరోలపై అభిమానాన్ని చాటుకుంటూ వారి ఫోటోలను తమ వాహనాలకు పెట్టుకుంటారు.. మరికొందరు తమ పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లను రేడియం స్టిక్కర్ల రూపంలో అతికిస్తారు. ఇంకొందరు క్యాప్షన్లను.. కొటేషన్లను మరికొన్ని డిఫరెంట్ స్టిక్కర్లను పెట్టుకుంటారు. కొంతమంది తమ కులాలను చెప్పుకునే విధంగా కూడా స్టిక్కర్లు అతికించుకోవడం ఇప్పుడొక ఫ్యాషన్ అయిపోయింది అయితే ఎన్ని స్టిక్కర్స్ వున్నా ఎక్కువ శాతం వాహనాలపై కనిపించేది మాత్రం హనుమాన్ స్టిక్కరే. హనుమాన్ అంటే మనకు ప్రయాణాల్లో ఎలాంటి ఆపదా రాకుండా కాపాడతాడాని భక్తుల విశ్వాసం. ప్రమాదాల నుంచి రక్షిస్తాడు కనుక చాలా మంది తమ వెహికల్స్ పై ఆంజనేయుని స్టిక్కర్‌ను అతికిస్తుంటారు. హనుమంతుని స్టిక్కర్లలో ఎక్కువ కనిపించే ఉగ్ర రూప హనుమాన్ సృష్టికర్త కరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్. గతంలో బైజూస్ లో పనిచేసిన ఈయన ప్రస్తుతం 99గేమ్స్ గేమ్ ఆర్ట్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేరళ లోని కసరాగఢ్ ప్రాంతానికి చెందిన ఈ చిత్రకారుడు 2015 లో తమ గ్రామంలో జరిగే ఉత్సవ పతాకం కోసం కొంతమంది స్నేహితులు అడగగా ఈ హనుమాన్ చిత్రాన్ని రూపొందించారు. నలుపు అవుట్ లైన్ పై కాషాయ వర్ణంతో చిత్రీకరించిన ఈ బొమ్మ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అనూహ్య స్పందన తో దేశవ్యాప్తం గా వైరల్ అయింది. ఆ చిత్రాన్నే చిన్న వాహనం, పెద్ద వాహనం అన్న తారతమ్యం లేకుండా పెట్టుకోవడం మొదలు పెట్టారు. 2017 నాటికి అత్యధిక వాహనాలపై ఈ బొమ్మే కనిపించడం తో ఓ కంపెనీ ఆ బొమ్మకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తామని, హక్కులను తమకు ఇవ్వాల్సిందిగా కోరింద కరణ్ ఆచార్య అందుకు నిరాకరించారు ఈ హనుమాన్ బొమ్మను రాయల్టీ ఫ్రీ బొమ్మగా వేశానని, అందుకు డబ్బులు తీసుకోలేనని ఖరాఖండిగా చెప్పేశారు ప్రజలందరూ ఈ బొమ్మను ఫ్రీగా వాడుకోవచ్చని చెప్పారు.అయితే కాపీ రైట్ ఫ్రీ గా వేశామని చెప్పిన ఈ బొమ్మ ను 2018 మే లో కాపీ రైట్ ప్రొటెక్ట్ చేశారు. ఓ కన్నడ ఫిల్మ్ మేకర్ ఎటువంటి అనుమతి తీసుకోకుండా పోస్టర్ పై ఈ చిత్రాన్ని ముద్రించడం తో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ హనుమాన్ చిత్రాన్ని కాపీ రైట్ పోటెక్ట్ చేశారు. అయినప్పటికీ వాహనాలపై వేసుకునే స్టిక్కర్లకు, స్టిక్కరింగ్ సంస్థలకు దేశవ్యాప్తంగా ఈ స్టిక్కర్ ఫ్రీ గానే వేసుకునే అవకాశం మాత్రం కల్పించారు.అందుకనే చాలా మంది ఈ బొమ్మను వాహనాలపై స్టిక్కర్ రూపంలో వేసుకుంటున్నారు. ఇదీ ఆ స్టిక్కర్‌కు వెనుకున్న అసలు విషయం..!