సినిమా రంగంలో మేధో చౌర్యం కొత్త కాదు.. కాపీరైట్ వివాదాలు అంతకన్నా కాదు.. కొన్ని వివాదాలు.. మరికొన్ని మనోభావాలు.. విడుదలకు ముందే బయటకు వచ్చి హల్చల్ చేస్తుంటే మరికొన్ని మాత్రం తాపీగా విడుదలైన సినిమా రిజల్ట్ ని చూసుకుని రచ్చ చేస్తుంటాయి. అప్పట్లో అయితే ఎడాపెడా ఏ సీన్నైనా కాపీ కొట్టేయచ్చు.. రీక్రియేట్ చేసేయొచ్చు.. ఈ తతంగం అంతా ఎవరికి తెలియకుండా గప్చుప్ గా జరిగిపోయేది. ఇప్పుడలా కాదే కొరియనోడు కూడా తెలుగు సినిమా చూస్తున్నాడు.. ఇటలీ మేకర్ కూడా ఇది తమ కథే అని క్లైమ్ చేస్తున్నాడు.. ఎప్పుడైతే అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయిందో ఆ దేశం ఈ దేశం అన్న బోర్డర్స్ చెరిగిపోయాయి..ఆడియన్స్ కి ఆప్షన్స్ ఎక్కువైపోయాయి.. వరల్డ్ లో ఉన్న చిత్రాలన్నీ సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చూసేసి రివ్యూలు రాసిపెట్టేంతగా ఎదిగిపోయారు.. ప్రేక్షకులు ఈ స్థాయికి ఎదిగితే మేకర్స్ ఏ మేరకు థింక్ చేయాలి. అక్కడిదో సీను.. ఇక్కడిదో ఫ్లాటు ఎత్తేస్తామంటే కుదరదు.. మన నిజాయితీ నిరూపించుకోవడానికి.. ఆరోపణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి సరైన సమాధానం చెప్పేందుకు రెడీగా ఉండాలి.. పారిపోతామంటే కుదరదు ప్రూవ్ చేసుకోవాల్సిందే. రొటీన్ గా కథలు కాపీ రైటు వివాదాల ఆరోపణలు రావడం వాటిని పరిష్కరించేందుకు రచయితల సంఘం ముందుకు రావడం షరామాములే.. అయితే ఎన్ని కథలకు న్యాయం జరిగింది ఎంతమంది కథకులకు పరువు దక్కింది అన్నది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్.. టెక్నాలజీ ఇంత ఎదిగిన ప్రపంచంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి కథాచౌర్యంనింద ను మోస్తున్నారు. తన వారసులను నిర్మాతలుగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేసే క్రమంలో ఓ రాయి ఆయన అద్దాల సినిమామేడకు తగిలింది. గతంలో బొమ్మరిల్లు చిత్రానికి సంబంధించి విడుదల అనంతరం వచ్చిన కథ వివాదాన్ని కొద్దిగా సులువుగానే పరిష్కరించేసుకున్న దిల్ రాజుకు మిస్టర్ పర్ఫెక్ట్ గట్టి ఝలక్ ఇచ్చింది 128A,415,420 కాపీరైట్ 63 ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేసి పెద్ద దెబ్బ కొట్టింది. 2011లో ప్రభాస్, కాజల్ ,తాప్సి పన్ను, ప్రధాన పాత్రలుగా దశరధ్ దర్శకత్వంలో ఇది వచ్చింది. దీనికి కథ దర్శకుడే సమకూర్చగా సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత టీవీలో ప్రసారమవుతున్న సమయంలో ఈ వివాదం మొదలైంది రచయితల సంఘంలో పరిష్కారానికి వచ్చిన రచయితల సంఘం దశరధ్ కే కొమ్ము కాస్తూ 2009లోనే ‘నవ్వుతూ’ అనే పేరుతో ఈ కథ తమ సంఘంలో రిజిస్టర్ అయిందని ‘నా మనసు కోరింది నిన్నే’ రచయిత్రి శ్యామలా రాణి వాదనను కొట్టేసే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు మాత్రం ఊరుకోలేదు..