ఆషాడ అమావాస్య ఎందుకంత ప్రత్యేకం…?

ఈ ఆదివారం వచ్చిన అమావాస్య గురించి సామాజిక మాధ్యమాల్లో విపరీత మైన ప్రచారం జరిగింది.. ప్రతి ఒక్కరూ దీని గురించి సెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు. నిజానికి ఆదివారం తో అమావాస్య కలసి వస్తే విశిష్టమా..? అసలు ఎంటీ ప్రత్యేకత.. ఆషాఢ అమావాస్య, నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య శ్రావణి అమావాస్య , హరియాళీ అమావాస్య ఇలా వివిధ రకాలుగా పిలిచే ఈ అమావాస్య రోజు ఈ పూజలు నిర్వర్తించినా వేయి జన్మలు పూజలు చేసిన ఫలం లభిస్తుందని పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయ ఫలం లభిస్తుందని పండితులు చెప్తుంటారు.

ఆషాడ బహుళ అమావాస్య చాలా శక్తివంతమైంది దానికి తోడు ఆదివారం కలిసి రావడం తో ఈ రోజు మరింత పవర్ ఫుల్ గా మారింది. ఇంకో విషమేమిటంటే పుష్యమి నక్షత్రం దీనికి తొడవటం. ఈ మూడు అంశాలు కలిసి రావటం అనేది చాలా అరుదైన విషయం ఇలా కలసి రావడాన్ని ఆమార్కం అంటారు. అమావాస్య ఆర్కము అంటే ఆదివారం ఈ రెండు కలసి రావటం. ఆమార్కాయోగం, పుష్యార్క యోగం ఈ రెండు కలిసి చాలా సంవత్సరాల తర్వాత రావడం తో ఈ రోజుకి అంత ప్రత్యేకత వచ్చింది. ఈరోజు ప్రత్యేక పూజల ద్వారా పితృ దోషం, కాల సర్ప దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు. పితృ దేవతల ఆశీర్వచనాలు అందుకోడానికి, పితృ తర్పణాలు ఇవ్వడం శ్రేష్ఠం.

ఈ పితృ తర్పణాల వెనుక ఓ పౌరాణిక గాధ ఒకటి ప్రచారం లో వుంది. పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానస పుత్రి పేరు అచ్ఛోద. ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యి ఏళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన “మావసుడు”. అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృ తర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలని కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుడు వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతన పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించిందని పురాణ కథనం వాస్తవానికి అమావాస్య రోజు తాంత్రిక ఉపాసన కు గాని తీవ్ర దేవతల ఉపాసన చేయటానికి అనువైన , శక్తివంతమైనటువంటి రోజు.. ఈరోజు ఉదయం నుంచి శివయోగం ఏర్పడుతుంది. ఉదయం 10.38 గంటలకు సిద్ధి యోగం ఉంటుంది. అలాగే ఉదయం 5.44 గంటల నుంచి మధ్యాహ్నం 1.26 వరకు రవి పుష్య యోగం ఉంది. దీనితో పాటు ఉదయం 5.44 గంటల నుంచి 1.26 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. పవిత్ర స్నానం ఆచరించేందుకు బ్రహ్మ ముహూర్తం మంచిది. అలాగే ఈరోజు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అభిజిత్ లగ్నంలో శివాఆరాధన శుభ ఫలితాలు కలుగుతాయి.
(సామాజిక మాధ్యమాలు , వివిధ గ్రంథాలనుండి సేకరించినవి)

Related posts

టికెట్ ధరకు విలువైన వినోదాన్ని గ్యారెంటీగా ఇస్తుందంటున్న దర్శకుడు

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More