భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాలూ ఘోషిస్తున్నాయి. దేశ తలరాతను మార్చే ఈ ఓటు విలువను తెలియజేస్తూ విశాఖ కంచరపాలెం మెట్టు లోని ఓ సెలూన్ షాపు యజమాని ఓటేసి వచ్చిన ఓటర్లకు హెయిర్ కట్ ఉచితం గా చేయనున్నట్లు ప్రకటించారు.. ఇక్కడి ఆర్కే స్మార్ట్ ది సెలూన్ అధినేత మల్లువలస రాధాకృష్ణ ఓటర్లను చైతన్యం పరిచేలా.. ఓటును సద్వినియోగం చేసుకున్న వారికి తన సెలూన్‌లో హెయిర్ కట్ ఫ్రీ అంటూ ప్రకటించారు. ఓటుకున్న ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రకటించానన్నారు. ఈ నెల 13న సోమవారం ఓటేసి వచ్చిన వారికి ఉచితంగా హెయిర్ కట్ చేస్తామన్న ప్రకటన పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.