అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కొకపోతే కష్టాలేనా…?

ప్రపంచం బాగా విస్తరించిన తరువాత ప్రతీది వ్యాపాత్మకంగానే మారిపోయింది.. ఆధ్యాత్మికత సంగతి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి పండగ లోను వ్యాపారమే ఎంటర్టైన్మెంటో ఉండాల్సిందే అన్నట్లు తయారయ్యింది.. సంప్రదాయం చిన్నదైపోయి అందులో బిజినెస్ ఎదిగిపోయింది.. అలా తొంభై శాతం వ్యాపారాన్ని అద్దుకున్న వేడుక అక్షయ తృతీయ.. వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతా దుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా”
పరమశివుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పినట్లు మత్స్య పురాణంలో అరవై ఐదవ అధ్యాయం లో ఉంది. మరి వైశాఖ శుద్ధ తదియ రోజున బంగారం కొనకపోతే కొంపలు మునిగి పోతాయా..? కొనుక్కొకపోతే కష్టాలేనా..? అసలేంటి ఈ వేడుక రహస్యం. నిజానికి మన ఇంట్లో ఉన్న బంగారం ఎంతైనా లక్ష్మీదేవికి అలంకరించండి.. పూజలు నిర్వహించండి.. దానాలు చెయ్యండి.. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ‘ఉదకుంభదానం’ పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పండితులు సూచిస్తున్నారు. మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి ఎవరో చెప్పినదానికి ప్రాధాన్యత ఇచ్చేస్తుంటాం.. అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి.. ? నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా దాని ఫలితాలు అక్షయంగా వుంటాయని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అందుచేత బంగారాన్ని కొనుగోలు చేస్తే… మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అలాగే గవ్వలు, గోమతి చక్రాలు పసుపు, కుంకుమలు, గంధం, పచ్చ కుంకుమ, గాజులు వంటివి కొనుక్కున్న శుభ ఫలితమే. అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం చెపుతోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వుంటుంది. జపం , హోమం , వ్రతం , పుణ్యం , దానం… ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అద్భుతమైన ఫలితాన్నిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని ఈ రోజున వారం , వర్జ్యం , రాహుకాలం,లతో సంబంధం లేకుండా ఏ శుభకార్యాన్నైనా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా మరెన్నో విశేషాలు ఉన్నాయి.. ఈ రోజే పరశురాముని జన్మదినం.
పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. త్రేతాయుగం మొదలైన రోజు. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ఇన్ని విశేషాలు ఉన్న అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని తెస్తుందని నమ్ముతారు… వ్యాపార విస్తృతి లో మమేకమైన ఈ ప్రపంచం ఎక్కువ బంగారాన్ని కొనమనే చెప్తుంది పొదుపు చేసిన డబ్బుతో సిరిని ఇంటికి తెచ్చుకుంటే మంచిదే.. అలా కాకుండా అప్పుచేసో , తప్పు చేసో బంగారాన్ని కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉంటుంది..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More