విశాఖ లో వేడుక.
స్టేజ్ ప్రదర్శనల్లో అదరగొట్టిన గొల్లపూడి మారుతీరావు రచన ‘కళ్ళు’ నాటకాన్ని ఆధారంగా చేసుకుని అదే పేరుతో ఈ సినిమా తీశారు. పది లక్షల నిర్మాణ వ్యయంతో దాదాపు అందరూ కొత్త నటులతో రూపొందిన కళ్ళు సినిమా విడుదలై ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తైంది. భారతదేశం తరఫున ఆస్కారు అవార్డుల నామినేషనుకు ఎంపికచేయబడిన ఈ చిన్న సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘు దర్శకత్వం వహించారు..మెగాస్టార్ చిరంజీవి ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమా కు సంగీత దర్శకత్వం వహించగా తెలారింది లెగండోయ్… మంచాలింక దిగండోయ్…’ అనే పాటను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి తానే రాసి స్వయంగా పాడారు. నటుడు కళ్ళు చిదంబరం పేరుకు ముందు ఇంటి పేరులా ఈ కళ్ళు ఈ సినిమా నుండే వచ్చింది. విశాఖ లో షూటింగు జరుపుకున్న ఈ సినిమా రిహార్సల్స్ బీచ్ దగ్గర చేస్తున్న సమయం లో ఈ నటులను చూసిన ఓ పోర్ట్ అధికారి డబ్బులు ధర్మం చెయ్యడం అప్పట్లో నటుల సహజ నటనకు నిదర్శనం గా చెప్పుకున్నారు రంగస్థలం పై ఎంత పెద్ద హిట్ అయిందో వెండితెర పై కూడా విమర్శకుల ప్రశంశలతో పాటు ‘ ఉత్తమ చిత్రం, గా ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (ఎం.వి రఘు), ఉత్తమ నూతన నటుడు (శివాజీరాజా) లకు నంది బహుమతి, ఉత్తమ దర్శకుడి ఫిలింఫేర్ పురస్కారాలను అందుకుంది. మొత్తం ఈ సినిమాకు 24 అవార్డులు వస్తే ఇందులో దర్శకుడికి 11 అవార్డులు రావడం విశేషం.
1988 లో విడుదల అయిన ఈ చిత్రం ముప్పై ఐదు వసంతాల పండగను షూటింగ్ జరుపుకున్న విశాఖలో జరుపుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో దర్శకుడు ఎం వీ రఘు మాట్లాడుతూ స్వాతి ముత్యం సినిమా వచ్చిన సమయంలో కళ్ళు సినిమా తీశామని మిగిలిన భాషాచిత్రాలకు అవార్డులు వస్తున్న నేపథ్యంలో కళ్ళు సినిమా తీశామన్నారు. ఆర్ట్ ఫిలిం అంటే అంటరాని సినిమా గా ప్రాచుర్యంలో వున్న గొల్ల పూడి మారుతి రావు నాటికను ఒక వ్రతం మాదిరిగా కళ్ళు సినిమా తీశాం అన్నారు. విశాఖలో ఎంతో మంది వ్యక్తులు సహకారంతో సినిమా పూర్తి చేశామని చెప్పారు. ఆదరణ మించిన రివార్డులు లేవు అని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రంగ సాయి ప్రతినిధి ఎన్.నాగేశ్వరరావు , రంగ సాయి మీడియా అధినేత బాదం గీర్ సాయి , వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు , ఘంట శాల గానావధాని
రహమతుల్ల , మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ , కళ్ళు చిదంబరం కుమారుడు రామ కృష్ణ , జనసేన నాయకుడు బొలి శెట్టి సత్యనారాయణ, మేడా మస్తాన్ రెడ్డి , రంగ సాయి సభ్యులు, డొనాల్డ్ డక్ నాగేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో దర్శకుడు ఎంవీ రఘు ను ఘనంగా సత్కరించారు.