ప్రముఖ ఏంకర్ సుమ ప్రధాన పాత్ర లో నటించిన జయమ్మ పంచాయతీ ధియేటర్ లలో రెండో రోజుకే చాప చుట్టేసినా డిజిటల్ ఫ్లాట్ఫామ్ అమెజాన్ లో మాత్రం సత్తా చాటుతోంది. జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న జయమ్మ పంచాయితీ అమెజాన్ ప్రైమ్ తెలుగు చిత్రాల్లో నెంబర్ వన్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఎన్ని మిలియన్ వ్యూ అవర్స్ ఉన్నాయన్నది నిర్మాణ సంస్థ ప్రకటించకపోయినప్పటికి గత మూడు వారాలుగా జయమ్మ పంచాయతీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది.అక్షయకుమార్ నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ తెలుగు వెర్షన్ రెండవ స్థానంలో ఉండగా సర్కారు వారి పాట, ఆచార్య, కేజీఎఫ్ చిత్రాలు తరవాత స్థానాల్లో ఉన్నాయి. గత మూడునెలలుగా తెలుగు సినిమాల స్ట్రీమింగ్ ని అమెజాన్ ప్రైమ్ తగ్గించుకోవడం.. చూడటానికి సినిమాలు లేకపోవడం. బుల్లితెర పై సుమ కి ఉన్న అభిమానులు సినిమాలో సుమ ఎలా చేసిందో ఓ సారి చూడాలనుకోవడం(గతంలో కెరీర్ తొలినాళ్లలో దాసరి దర్శకత్వంలో కళ్యాణప్రాప్తిరస్తూ సినిమా లో సుమ హీరోయిన్ గా నటించింది) ఇలా ఎన్నో కారణాలు జయమ్మ కి కలిసొచ్చాయి. సర్కారు వారి పాట, ఆచార్య చిత్రాలను అప్పటికే ఆడియన్స్ ధియేటర్ లలో చూసేయడం వలన ఈ రెండు చిత్రాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో గణనీయమైన వ్యూస్ సాధించలేకపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కూడా చిన్నచిత్రాలను తగ్గించుకోవడం వలన సగటు ప్రేక్షకుడికి వినోదం తగ్గిందనే చెప్పాలి. అరచేతిలో వినోదానికి అలవాటు పడ్డ ఆడియన్ ఇప్పుడు ఏ సినిమా వచ్చినా చూసే మూడ్ లొనే ఉన్నాడన్నని విశ్లేషకులు చెప్తున్న మాట.