యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అధిపురుష్ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శక నిర్మాతలపై బాగా ప్రెషర్ పడింది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగోలేవని, కార్టూన్స్‌లాగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు దర్శక, నిర్మాతలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌పై మరొకసారి పని చేయాలని భావించింది. దీనికోసం మరి కొంత సమయం కేటాయించాల్సిన అవసరం రావడంతో ఇదివరకు ప్రకటించిన సినిమా రిలీజ్ డేట్ కాకుండా మరో డేట్ కు పోస్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చిత్ర దర్శకులు ఓం రౌత్ జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా 2023 జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు తెలియజేశారు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న “ఆది పురుష్” సినిమా బాగా వచ్చే విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. టీజర్ కు వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ దృష్ట్యా ఈ మూవీ కోసం మరింత పని చేయాలని భావించింది. దీంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది జూన్ 16వ తేదీకి వాయిదా పడింది. సినిమాలోని విజువల్స్ ఇంకా బాగా వచ్చేందుకు సుమారు వంద కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. ప్రధాన పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో కృతిసనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీ సిరీస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అజయ్ అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు.