దట్ ఈజ్ మాడుగుల హల్వా ..

‘మాడుగుల’ ఈ ఊరు పేరు వినగానే మన మనసు లో హల్వా మాత్రమే మెదులుతుంది.. తమిళనాడు లోని తిరునల్వేలి హల్వా తరువాత అంతటి అంతర్జాతీయ ఇమేజీ కలిగిన మాడుగుల హల్వా కారణంగానే ఈ ప్రాంతానికి ఒక విశిష్టత వచ్చింది. ఈ హల్వా మార్కెట్ ని రుచిమయం చేసి సుమారు ఒకటిన్నర శతాబ్ధం దాటినా దాని క్రేజ్, డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. సరికదా ఇమేజ్ అంతర్జాతీయ స్థాయి కి చేరింది. 1890లో ఓ మిఠాయి వ్యాపారి అభిరుచి ఇప్పుడు 20కి పైగా దేశాలకు ఈ హల్వా రుచిని చూపిస్తోంది. దంగేటి ధర్మారావు అనే స్వీట్స్ వ్యాపారి కొత్తరకం స్వీట్‌ తయారు చేయాలనే ఆలోచన తో ఈ హల్వా కు రూపకల్పన చేసి ప్రజలకు రుచి చూపించారు.. కమ్మటి నేతి వాసన తో టేస్ట్ విభిన్నంగా ఉండడంతో జనాల జిహ్వకు ఇది కొత్తగా అనిపించింది. అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతే ఆ హల్వా ఘుమఘుమలు విదేశాలకు వీసా లేకుండా వెళ్లిపోయాయి.అంత విశిష్టత కల్గిన ఈ హల్వా తయారికి పెద్ద ప్రోసెసే ఉంది. హల్వా తయారవ్వాలంటే నాలుగు రోజుల సమయం పడుతుంది. గోధుమలు మూడు రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి తీసిన గోధుమ పాలను ఒక రోజు పులియబెట్టి… వాటికి ఆవు నెయ్యి, పంచదార కలిపి దగ్గరకు మరిగే వరకు చేసి ఆ పాకం లో జీడిపప్పు, బాదం పప్పు కలిపి అమ్మకానికి పెడతారు.. అయితే ఇదే ఫార్మాట్ లో వేరెవ్వరు తయారు చేసినా ఈ రుచి రాదు. చాలామంది మాడుగుల హల్వా పేరుతో అమ్మకాలు కొనసాగిస్తున్న ఆ రుచివేరు అన్నది తినే వారి మాట.. ఎంత మంది ఎన్ని రకాల హల్వాలు తయారు చేసినా మాడుగుల హల్వా రుచి మాత్రం విభిన్నం. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా దీనిని తయారు చెయ్యడం తోనే దీనికి ఆ రుచి. ఈ హల్వాని కేవలం దంగేటి కుటుంబానికి చెందిన వంశీకులు మాత్రమే గతంలో తయారు చేసేవారు. హల్వా కి ఉన్న క్రేజ్ దృష్ట్యా వీరి దగ్గర పనిచేసిన కొంతమంది వేరుగా షాపులు పెట్టుకుని హల్వా తయారి ప్రారంభించారు. ఈ క్రమంలో మాడుగుల హల్వా పెద్దబ్రాండ్ గా మారింది. ఈ ఊరిలో హల్వా వ్యాపారం పై ఆధారపడి సుమారు పదిహేను వందలకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.. హల్వా కి విపరీతమైన డిమాండ్ బాగా ఉండడం తో ఇక్కడి వ్యాపారస్తులు ఆన్లైన్ వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టారు కొంతమంది నేరుగా… కొరియర్ ద్వారా పార్సిల్ పంపుతుండగా మరికొందరు కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థ లతో ఇంకొన్ని వెబ్సైట్ లతో ఒప్పందాలు చేసుకుని హల్వా రుచిని విశ్వ వ్యాపితం చేస్తున్నారు. విశాఖపట్నం.. అరకు వచ్చే కొంత మంది పర్యాటకులు తప్పనిసరి గా హల్వా ని పట్టుకుని బంధువులు, మిత్రులకు ఇవ్వడం వారు ఆ రుచిని పొగుడుతూ మళ్లి ఆ రుచి ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూడటం పరిపాటే. శుభకార్యాల విందుభోజనాల మెనూ లో కూడా మాడుగుల హల్వా చోటు దక్కించుకుంది. ఇక్కడ షూటింగ్ లకు వచ్చిన సినీ నటులు , సాంకేతిక నిపుణులు , ఇతర ప్రముఖులు ఈ హల్వా కి ఫిదా అయినవారే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అన్ని కలిగిన ఈ మాడుగుల హల్వా రుచిని ఒక్కసారి చూస్తే అది చిరకాల బంధం గా మిగిలిపోవడం మాత్రం ఖాయం. దట్ ఈజ్ మాడుగుల హల్వా

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More