నవరస నటనా సార్వభౌమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దిగ్గజనటులతో సరి సమానంగా… నిజం చెప్పాలంటే పోటాపోటీగా నటించే ప్రతిభ ఆయన సొంతం. నటుడు అంటే ఇలాగే ఉండాలనిపించే విగ్రహంతో ఏ పాత్రైనా అవలీలగా పోషించే విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ చాలా సినిమాల్లో ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన ఆయన చాలా సినిమాల్లో ఎన్టీఆర్ ని ఎదిరించిన ప్రతి నాయకుడు. ఇంకా చెప్పాలంటే నందమూరి తారకరాముడికి అత్యంత ఇష్టుడు. ‘తాతమ్మ కల’ సినిమాకు ఉత్తమ కథకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు అందుకున్న ఎన్టీఆర్ తన మదిలో మిగిలిన మరో కధ ను తెరకెక్కించ దలచారు.. ఓసారి పరమానందయ్య శిష్యులు కధ షూటింగ్ విరామ సమయంలో సత్యనారాయణ తో మాట్లాడుతూ తాను తయారు చేసిన ఉమ్మడి కుటుంబం స్టోరీ చెప్పి ప్రధానమైన నాలుగు పాత్రల క్యారెక్టరైజేషన్ చెప్పి ఇందులో నీకు ఏ పాత్ర ధరించాలని ఉందొ చెప్పమన్నారు. నాలుగు వేరు వేరు విభిన్న పాత్రలు పెద్దోడు స్కూల్ టీచర్ రెండవవాడు రైతు స్వతహాగా పాజిటివ్ క్యారెక్టరే కానీ భార్య మాట వినే పాత్ర. ఇక మూడోపాత్ర డాక్టర్ చెడు అలవాట్లు లోన ఇంట్లో గొడవలు పెట్టే పాత్ర కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర. చివరి పాత్ర హీరో పాత్ర ఇది రామారావు చెప్పిన పాత్రల లిస్టు ఇందులో ఏ పాత్ర కావాలని అడిగితే నాకు రైతు పాత్ర ఇవ్వండి అని అడిగారు సత్యనారాయణ విలన్ గా మిమల్ని చూసే ప్రేక్షకులు డాక్టర్ క్యారెక్టర్ లాంటి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారే కానీ ఇలాంటి సాత్విక్ పాత్రలో…? అని సంశయం వ్యక్తం చేశారట. వెంటనే సత్యనారాయణ మీరు అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఏ నటుడికైనా వైవిధ్యం గల పాత్రలు ధరించి మెప్పిస్తేనే అది గుర్తింపు దయచేసి నాకు ఆపాత్రనే ఇవ్వండి ప్లీజ్ అని అభ్యర్థించారు. చాలా రోజులైపోయాయి సినిమా షూటింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ సత్యనారాయణకు కబురు మాత్రం రాలేదు. దాంతో నేరుగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన తో ఉన్న చొరవ కొద్దీ నాకు ఆ పాత్ర ఇవ్వకపోతే మీ ఇంటి ముందు దీక్ష చేస్తానని బెదిరించారు. ఒక నటుడికి ఆ పాత్ర పై ఉన్న ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్ సత్యనారాయణ కోరుకున్న వ్యవసాయదారుడి పాత్రని ఆయనకే ఇచ్చారు. సినిమా లో కీలకమైన ఆ పాత్ర ఊహించినట్టే సూపర్ హిట్ అయింది. అంతవరకు ప్రతి నాయక పాత్రలకే అనుకున్న సత్యనారాయణను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ చేసింది. ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో సోదరుడు త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాకు యోగానంద్ దర్శకుడు కాగా ఈ చిత్రానికి కధ తో పాటు స్క్రీన్ ప్లే ని కూడా ఎన్టీఆర్ సమకూర్చడం విశేషం.