అప్పుడప్పుడు మనం వింటుంటాం.. ఆకాశం నుంచి ఉల్కలు మండుతూ అత్యంత వేగంగా దూసుకొచ్చి భూమ్మీద పడుతున్నట్లు వింటూ ఉంటాం. ఉల్క సైజును బట్టి భూమి మీద పడిన ప్రాంతం ఒక లోతైన గొయ్యలా ఏర్పడుతూ ఉంటుంది. ఇవ్వన్నీ ఎక్కువగా ఇతర దేశాలలో జరుగుతుండటం. ఆ వార్తలను మనం వింటూ ఉండడం జరిగేది. అయితే ఇటువంటి ఒక సంఘటన భారత్ లో కూడా ఒకటి జరిగింది. కానీ అది మరీ అంత పెద్ద సైజ్ ఉల్క అయితే కాదు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి ఆకాశం నుంచి భూమి దూసుకొచ్చింది. భారత్ లోని ఒక గ్రామంలోని పొలంలో పని చేసుకుంటున్న రైతు సమీపంలోనే అది పడింది. 2021 సెప్టెంబర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఈ సంఘటన కోసం అందరూ ఆసక్తిగా చర్చించుకునేవారు. ఆ రాయిని చూసేందుకు సమీప ప్రజలు ఎగబడేవారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని వశి తాలుకాలోని ఓ గ్రామంలో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆకాశం నుంచి అరుదైన రాయి ఓ రైతు పొలంలో కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి ఎప్పటిలానే ఉదయం 6.30 గంటల సమయంలో పొలంలో కూరగాయలు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడినట్లు రైతు వెల్లడించాడు. భయంతో రైతు పరిశీలించగా అది చాలా విచిత్ర ఆకారంలో కనిపించింది. రాయిని చూసి భయపడిన రైతు వెంటనే స్థానిక తహసీల్దార్ నర్సింగ్ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు. రాయి పడిన వెంటనే ఎవరో తనపై రాయి విసిరారని అనుకున్నానని రైతు ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చుట్టు పక్కల చూడగా ఎవరూ కనిపించలేదని రైతు తెలిపాడు. మొదట భయపడి అనంతరం రాయిని తాకగా రాయి చల్లగా ఉందని ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. ఈ రాయిని పరిశీలించిన ఉస్మానాబాద్‌లోని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇది ఒక ఉల్క అవేశేషం అని పేర్కొన్నారు. తోకచుక్క అవశేషాలు ఇలానే ఉంటాయని తెలిపారు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి బరువు 2.38 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రాథమిక తనిఖీ పూర్తైన తర్వాత ఈ రాయిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే రంగును బట్టి కొందరు ఈ రాయిని బంగారు శిలగా పేర్కొంటున్నారు.