ప్రపంచంలో వింతలకు కొదవలేదు. ఇప్పటివరకు ఎన్నో బయటపడ్డాయి. బయట పడవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో మనకు ఉపయోగపడేవి కొన్నే ఉండగా, మరికొన్ని మానవ వినాశనానికి దారి తీసేవి ఉన్నాయి. అటువంటి వింతలను తెలుసుకునేందుకు సైంటిస్టులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. కొన్నిటికి సంబంధించి వివరాలు.. వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలియగా, మరి కొన్ని మాత్రం జవాబులు లేని ప్రశ్నలాగానే మిగిలిపోయాయి. ఈ వింతలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మరిగే (ఉడికే)నది ( బాయిలింగ్ రివర్). దీన్ని 2011 లో ఆండ్రీ రౌజో అనే వ్యక్తి కనుగొన్నారు. ఈ నదిని ‘మయనటుయకు’ అని కూడా పిలుస్తారు. సహజంగా మనం ఏ నది దగ్గరకైనా వెళ్తే చల్లని గాలులతో ఆహ్లాదకరం గా ఉంటుంది కానీ ఈ నది ఉక్కపోత తో వేడి గాలులతో పలకరిస్తూ మనలో భయాన్ని కొత్త అనుభూతి ని పంచుతుంది.ఈ మరిగే వేడి నది దక్షిణ అమెరికాలోని… పెరూ దేశంలో. అత్యంత దట్టమైన అమెజాన్ అడవిలో అత్యంత రహస్యంగా ఉంది. దీనిని కనుక్కోవడానికి ఆండ్రీ చాలా కష్టపడ్డాడు. ఈ నదిలో నీళ్లు 24 గంటలూ మరుగుతూనే ఉంటాయి. 200 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంపరేచర్ కలిగిన ఈ నది పొడవు 6.4 కిలోమీటర్లు, వెడల్పు 82 అడుగులు, 20 అడుగుల లోతు ఉంటుంది. ఈ నదిలోని వాటర్‌తో గుడ్లు, రైస్, ఇతర ఆహార పదార్థాలను క్షణాల్లో ఉడకబెట్టవచ్చు. అలాగే ఎవరైనా పొరపాటున అందులో పడినట్లయితే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని ఈ నదిని పరిశీలించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ నదిలో నీళ్లు ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి. అందులో జీవి కాదు కదా చిన్న క్రిమి కీటకాలు కూడా బతికేందుకు అవకాశం లేదు. ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన, భయానక నదులు అనేకం ఉన్నాయి. కానీ, అమెజాన్ అడవిలో ఈ నదిలో నీరు ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి. ఈ మరిగే నది(బాయిలింగ్ రివర్)ని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నదిలోని నీరు ఇలా మరగడానికి గల కారణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం మరిగే నదిని కనుగొన్న ఆండ్రీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఆండ్రీ చిన్నగా ఉన్నప్పుడు అతని తాత మరిగే నది కథను తరచుగా చెబుతుండేవాడట. అలా ఆ నది గురించి తెలుసుకోవాలని మనసులో బలంగా నిశ్చయించుకున్నాడు ఆండ్రీ. అతను పెరగడంతో పాటు ఆ నది ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అని తెలుసుకోవాలనే తపన కూడా పెరిగి పెద్దదయ్యింది. ఎలాగైనా ఆ నదిని కనుగొనాలని ఫిక్స్ అయ్యాడు. ఈ నది గురించి చాలా మందిని ఆరా తీశాడు. ఆండ్రీ పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో అమెజాన్ అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా అమెజాన్ అడవిలో మరిగే నదిని కనుగొనేందుకు వేట సాగించిన ఆండ్రీ చివరికి 2011లో తన లక్ష్యాన్ని సాధించాడు. మరిగే నదిని కనుగొన్ని ప్రపంచానికి దాని చిరునామాను పరిచయం చేశాడు. ఏకంగా సుమారు 7 కిలోమీటర్లు పొడవు కలిగిన నది నిత్యం మరుగుతూ ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాల్సిందే. అయితే, ఈ నదిలో నీరు 24 గంటలూ మరగడానికి గల కారణాలేంటనేది ఇప్పటికీ తెలియరాలేదనేది స్పష్టమవుతుంది.