Vaisaakhi – Pakka Infotainment

అంగన్వాడీ టీచర్ ఉద్యోగం పోయింది..ఎమ్మెల్యే గా గెలిచింది..

నెలకు పదకొండున్నర వేల జీతం..అంగన్వాడీ టీచర్ ఉద్యోగం.. రాజకీయ కారణాలతో అదికూడా పోయింది. జాబ్ పోయిందని బాధ పడుతూ కూర్చోలేదు.. కాలాన్ని నింధిస్తూ కుమిలిపోలేదు.. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ పోరాడింది.. ఆ యువతికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి రెండు నెలల వ్యవధిలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ టికెట్ ఇచ్చారు. మూడు పదులు వయసు రాకుండానే మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. అది కూడా పదిహేను సంవత్సరాలుగా గెలుపు ఎరగని రంపచోడవరం నియోజవర్గంలో టిడిపి జెండా ఎగరవేసింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజవర్గం రాజవొమ్మంగి మండలంలో అంగన్వాడీ టీచర్ మిరియాల శిరీష గా ఈమె భర్త విజయ భాస్కర్ స్ధానిక టిడిపిలో చురుకుగా వుండేవారు. అలాగని పెద్ద పదవి కూడా కాదు. రంపచోడవరం నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించే వారు. భర్త టిడిపిలో క్రియాశీలకంగా ఉంటే భార్య అంగన్వాడి టీచర్ గా ఎలా ఉద్యోగం చేస్తారని ఆ నియోజకవర్గాన్ని శాసించే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అభ్యంతరం పెట్టారు.సిడిపిఓ దగ్గరికి వెళ్లి ఆమెను తొలగించకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానని బెదిరించారు. ఈ పరిస్థితిని గమనించి ఎవరో ఉద్యోగం నుంచి తీయించడం ఏమిటని తానే గత ఏడాది డిసెంబర్లో అంగన్వాడి ఉద్యోగానికి రాజనామా చేసారు.భర్తతో కలిసి టిడిపి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. బిఈడి చదవడంతో పాటు ప్రజలను ఆకట్టుకునే విధంగా మాటతీరు ఉండటం కలసి రావడం తో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందారు.అది ఏ స్థాయిలో అంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి టిక్కెట్ ఇచ్చే స్థాయికి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించారు. రాష్ట్రంలోనే చిన్న వయసు ఎమ్మెల్యేగా రికార్డుకు ఎక్కారు. ఎవరైతే ఉద్యోగం తీయించారో వారినే బెదిరిపోయే స్థాయికి వచ్చారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగిఉన్న ఈ చిన్న వయసు ఎమ్మెల్యే పేరు మిరియాల శిరీష దేవి. 2009లో ఏర్పడిన ఈ రంపచోడవరం నియోజవర్గంలో ఇప్పటివరకు టిడిపి జెండా ఎగరలేదు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందిగా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని టిడిపి మొదటగా ఓడిపోయే నియోజకవర్గం రంపచోడవరం గా అందరూ భావించారు. కాని పరిస్థితులు పూర్తిగా తారుమయ్యాయి.9,139 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చనే నానుడును ఈ అమ్మాయి నిజం చేశారు. కోస్తా జిల్లాలలో అధిక విస్తీర్ణం గల నియోజకవర్గమైన రంపచోడవరం ప్రజలకు ఈ మధ్యతరగతి ఎమ్మెల్యే మెరుగైన పరిపాలన అందించాలని ఆశిద్దాం.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More