నిజానికి ఆషాడం అవ్వగానే పూజలు వ్రతాలు మొదలైపోతాయి.. శ్రావణ మాసం హడావిడి అంతా ఇంతా కాదు.. ఈసారెంటి అధిక శ్రావణం అంటున్నారు.. రెండు శ్రావణాలు ఉన్నాయా…? ఎందుకలా వచ్చింది..
ఇంతకీ ‘అధికమాసం’ అంటే ఏమిటి? అధిక శ్రావణంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది. అవి దక్షిణాయనం,ఉత్తరాయణం. దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయనం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల్ల ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం సహజంగా జులై మధ్య కాలంలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి.. సూర్యగమనాన్ని బట్టి కాలాన్ని ఈ విధంగా విభజించారని చెపుతారు. నిజానికి కాలగణన జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్య, చంద్రుల ఆధారంగానే జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకొని లెక్కకడితే ‘సౌరమానం’ అనీ, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకుంటే ‘చాంద్రమానం’ అనీ అంటారు. చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో ఏడాదికి 354 రోజులు. సౌరమానంలో ఏడాదికి 365 రోజులు. అంటే సౌరమానానికీ, చాంద్రమానానికీ మధ్య ఏడాదిలో 11 రోజుల తేడా. ఈ వ్యత్యాసాన్ని సరి చెయ్యడానికి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దానినే ‘అధికమాసం’ అంటారు. అధికమాసాలలో వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలను ఆచరించడం సరికాదని పండితులు చెబుతున్నారు అలాగే పితృకార్యాలను కూడా అధికమాసంలో కాకుండా నిజమాసంలోనే జరపాలి. మరి అధిక మాసం ప్రత్యేకత ఏంటి అంటే మహా విష్ణువుకు ఇది ప్రత్యేకమైన నెల. కాబట్టి దీనికి ‘పురుషోత్తమ మాసం’ అనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడనీ పురాణాలు చెబుతున్నాయి. ‘‘పురుషోత్తమమాసంలో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు, జప, హోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయని అధికమాస మహిమ గురించి మహా విష్ణువు లక్ష్మీదేవి తెలియజేసినట్లు శాస్త్రాలు చెపుతున్నాయి. అధికమాసంలో శుక్ల పక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి రోజునైనా కనీసం పుణ్య కార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది… ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన, విష్ణుసహస్రనామ పఠనం, ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు, దీక్షల వల్ల రెట్టింపు ఫలాలు పొందవచ్చని పండితులు వివరించారు.. .