మన గ్రహదోషాలను నివారించమని మనం కోరుకునే శని భాగవానుడు అంటే చాలామంది భయపడుతూ వుంటారు… మిగిలిన అందరి దేవతల్లా కాకుండా ఆయన్నో భయంకరుడిగా భావిస్తుంటారు.. నిజానికి శని దేవుడు నిత్య శుభంకరుడు
సూర్య తాపం భరించలేక సంజ్ఞాదేవి తనకు ప్రతిగా ఛాయను సృష్ఠించి ఆమె తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్లిపోయిన సమయంలో ఛాయకు, సూర్యుడికి పుట్టిన కుమారుడే శని.
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం – యముడికి సోదరుడు,
ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు.తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని దీని భావం. అలాంటి శనైశ్చరుడి గ్రహ దోషం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు.. ఆయన ఆశీస్సులు పొందితే ఎలాంటి దోషమైన దరి చేరదు..కృతయుగం లో ఓనాడు కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగినవాడంటూ అతని ప్రత్యేకతలన్నీ గొప్పగా చెపుతుంటే వింటున్న శివుడికి శనిని చాలా ఎక్కువ గా నారదుడు కీర్తిస్తున్నాడేమో అని అనుకోవడమే కాకుండా ‘నువ్వు చెప్పినట్టే ఆ శని అంత శక్తి సంపన్నుడైతే నన్ను పట్టుకొని ఆ ప్రభావం ఎంటో చూపించమను…’ అని నారదుడి తో గర్వం గా అన్నాడు… నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శని శివుడి మాటని స్వీకరిస్తాడు… ఈరోజే పరమశివుడికి నా ప్రభావం చూపిస్తాను అని చెప్పేసరికి పరమశివుడు ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లి, ఓ మర్రిచెట్టు తొర్రలో దాక్కుంటాడు. తెల్లారేసరికి, అక్కడ శని ప్రత్యక్షమై శివుడికి నమస్కరిస్తాడు.
అప్పుడు విజయ గర్వం తో బయటకు వచ్చిన పరమ శివుడు.. ప్రభావం చూపిస్తానని చెప్పి నమస్కరిస్తున్నావు ఇదేనా నారదుడు నీకోసం గొప్పగా చెప్పింది అని నవ్వుతుండేసరికి ‘శంకరా… కైలాసంలో మీ ప్రమధ గణాలతో ఉండాల్సిన తమరు ఇలా అడవులపాలవ్వడమే కాకుండా ఒక తొర్రలో ఇరుక్కు పోయి దాక్కోవలసి వచ్చింది ఇది నా ప్రభావము కాదా స్వామీ!’ అని వినయంగా చెప్పెసరికి శని సమయస్ఫూర్తికి, ప్రభావానికి మెచ్చుకున్న ఈశ్వరుడు ఆ రోజు నుంచి ‘ఈశ్వర’ అనే శబ్దం తనతో పాటు శనికి కూడా వర్తిస్తుందని వరమిచ్చాడు. ఆ ఫలితంగా శని, శనీశ్వరుడు అయ్యాడు. గ్రహాలలో ఈశ్వర నామం ధరించిన ఒకే ఒక్కడయ్యాడు..
జాతక ప్రకారం శని కలిగించే ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే ఆయనను మంచి చేసుకోవడం ఒక్కటే మార్గం. ఎప్పుడైతే శని తత్త్వం అర్థమవుతుందో, అప్పుడు మనకు ఆయన మార్గదర్శిగా, గురువుగా సాక్షాత్కరిస్తాడు. ముందుచూపుతో ప్రవర్తించేలా మనల్ని చైతన్యపరుస్తాడు. ప్రాపంచిక సుఖభోగాల నుంచి విముక్తి కలిగిస్తాడు. వివేకంతో వర్తించేలా చేస్తాడు. కష్టానికి తగ్గ ఫలితాన్నిస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు.