సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పథకాల అమలుకు జీతాలకు జూలై 1 నాటికి అక్షరాల 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు. రైతులకు ఏటా వేస్తానన్న 20 వేలు. స్కూలుకు వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు. 18 నుంచి 59 ఏళ్ళ దాకా ప్రతి మహిళ కు 15 వేలు. నిరుద్యోగ భృతి 3 వేలు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా ఇవన్నీ తొలిదశ లో ఇవ్వాల్సివుంది. సూపర్ సిక్స్ కచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన ఎన్డీయే కూటమి ఆ దిశ గా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి అవే గుదిబండలుగా మారనున్నాయి.అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్లు పప్పు బెల్లాల్లా పంపిణీ చేసేసారు. అభివృద్ధి ని పూర్తిగా విస్మరించి తాయిలాలు మాత్రమే గట్టెక్కించేస్తాయని గుడ్డిగా నమ్మిన గత ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీ జీతాలివ్వలేని దుస్థితికి తీసుకొచ్చింది. జగన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేశారని నిన్న మొన్నటి దాకా ఆరోపించిన అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంకు ఇపుడు సీన్ రివర్స్ అయింది. అధికార మార్పిడి తరువాత పరిశ్రమలు వచ్చే అవకాశం కొద్దో గొప్పో కనిపించడం మాత్రమే ఈ ప్రభుత్వానికి చిన్నపాటి ఊరట.. చంద్రబాబు విజన్ తో ఏదో చేస్తారన్న నమ్మకం ఉన్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం గాడిలో పడటానికి ఒక సంవత్సరం పైనే పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.. ఒకవైపు ప్రభుత్వ స్థలాల తాకట్టు, వడ్డీలు సంక్షేమ తాయిలాలు, ఇవన్నీటిని అధిగమించాలంటే ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగాల్సిందే అంటున్నారు.. ఇప్పటికే మద్యం అమ్మకాలపై తీసుకున్న నిర్ణయం వలన ఆదాయం పెరుగుతుందని అంటున్నారు.. ఏదైనా బటన్ వ్యవస్థ కు మెల్ల మెల్లగా మంగళం పాడితే తప్పా రాష్ట్రాలకు భవిష్యత్ ఉండదని హెచ్చరిస్తున్నారు.
previous post