“బుర్ఖా, ఘూంఘట్… రెండింటినీ నిషేధించాల్సిందే’’ అంటూ ప్రముఖ కవి, గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ‘కర్ణిసేన’ భగ్గుమంది. ‘బుర్ఖా అనేది టెర్రరిజం, జాతీయ భద్రతకు సంబంధించినదైతే… ఘూంఘట్ అలాంటిది కాదు… ఈ విషయంలో జావేద్ అక్తర్ మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాల్సిందే. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి’ అంటూ హెచ్చరికలు కూడా జారీచేసింది. ఈ నేపథ్యంలో జావేద్ అక్తర్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ‘తాను చేసిన వ్యాఖ్యలను కేవలం మహిళా సాధికారత కోణంలోనే చూడాలని, ఇలాంటి బెదిరింపులు తనకు కొత్తేం కాద’ని అంటున్న ‘జావేద్ సాబ్’ ఈ సందర్భంగా తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టుగా తెలిపారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే…నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటున్న నా మిత్రులు ఒక విషయం గ్రహించాలి. బుర్ఖా, నఖాబ్, పర్దా వంటి అంశాలపై నేను గత 20 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా. చాలా ఏళ్ల క్రితమే నేను ‘త్రిపుల్ తలాక్’ను వ్యతిరేకిస్తూ మాట్లాడా. అయితే అవి వార్తల్లోకి రాలేదు. మైనారిటీ కమ్యూనిటీలో తిరోగమన మైండ్‌సెట్ ఉన్న అంశాలకు నేనెప్పుడూ వ్యతిరేకంగానే నిలబడ్డా. మార్పు తీసుకురావాలంటే తప్పకుండా మనం పుట్టిన కమ్యూనిటీలోని లోటుపాట్ల వైపు ముందుగా చూడాలి. అది మన బాధ్యత కూడా.నేను ఒకసారి ఘాంఘట్ గురించి మాట్లాడినందుకే నన్ను క్షమాపణలు చెప్పాలంటున్నారు. అంటే ముల్లాలకు వ్యతిరేకంగా పోరాడిన నా క్రెడిబిలిటీని మీరు నాశనం చేయాలనుకుంటున్నారా? ‘ఘూంఘట్’ అనేది ఒక సంప్రదాయమే కానీ మతపరమైన నమ్మకం కాదనేది అందరికీ తెలుసు. అది కూడా కేవలం పల్లెల్లోనే మిగిలి ఉందని, అంతటా లేదని కూడా అంటున్నారు. అలాంటప్పుడు ఈ విధంగా ఎందుకు స్పందిస్తున్నారు?విభిన్న స్వరాలను వినాల్సిందే…కొన్ని అభిప్రాయాలు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోనూవచ్చు. అంతమాత్రాన, ‘నీ కళ్లు పీకేస్తాం… నీ నాలుక చీరేస్తాం…’వంటి మాటలు సరైనవి మాత్రం కావు. ఒకవేళ నా వ్యాఖ్యల వల్ల మీరు (కర్ణిసేన) నొచ్చుకుంటే నన్ను కోర్టుకు లాగొచ్చు. కానీ ఒక నాగరిక సమాజంలో ఇలాంటి బెదిరింపులు సరైన పద్ధతి కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛను అసహనంతో అణచాలని చూడొద్దు. నేను పెరిగిన భారతదేశం ఇది కాదు. పరమత సహనంతో ఉన్న దేశమిది. మన రాజ్యాంగం ఇక్కడ జీవిస్తున్న అందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను అందించింది. ఇలాంటి స్వేచ్ఛ మన పొరుగుదేశాల్లో కూడా లేదు.విభిన్న స్వరాలను ప్రతీ ఒక్కరూ వినాల్సిందే. బుర్ఖాను వ్యతిరేకిస్తే, ముస్లింవాదులు నేను వారినే వ్యతిరేకిస్తున్నానన్నారు. మరోవైపు హిందూవాదులు ప్రతీసారి నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కానీ నా అసలు ఉద్దేశం ఏమిటంటే, ముఖాన్ని కప్పేసేది ఏదైనా… అది ఘూంఘట్, నఖాబ్, బుర్ఖా కావొచ్చు… మతపరమైన లేదా సామాజికపరమైన అలాంటి ఏ సాంప్రదాయమైనా అది తప్పకుండా మహిళా సాధికారతకు అవరోధమే. ముందుగా దాన్ని నిషేధించాలి. శ్రీలంకలో అంటే భద్రత కోసం నిషేధించారు. కానీ మన దేశంలో తప్పకుండా మహిళా సాధికారత కోసం నిషేధించాలి. బుర్ఖా, ఘూంఘట్ అనేవి దేశభద్రతకు ఏ మేరకు ముప్పో తెలియదు కానీ, మహిళల అభ్యున్నతికి మాత్రం తప్పకుండా ముప్పే.అలాంటి అభిప్రాయాలు సరైనవి కావు…చాలామంది మహిళలకు తమకు ఏం కావాలో చెప్పే స్వేచ్ఛ లేదు. వారిపై కుటుంబానికి సంబంధించిన అనేక ఒత్తిడులుంటాయి. చిన్నప్పటి నుంచి బుర్ఖా, ఘూంఘట్ ధరించాలని వారిని బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. వాటిని ధరించడం వల్ల ఆయా కమ్యూనిటీల్లో మంచిదాన్ని అనిపించుకోవచ్చనుకుంటారు. అయితే వాటిని ధరించకుండా ఉండే వందేళ్ల స్వేచ్ఛను వారికి ముందు ఇవ్వండి, ఆ తర్వాత బుర్ఖా ధరించాలనుకుంటున్నారా అడగండి. కొన్ని తరాలకు అలాంటి ఛాయిస్ ఇచ్చి అటు పిమ్మట వారు తిరిగి వాటిని కోరుకుంటే ఇవ్వొచ్చు.అలాగే ఆడపిల్లలు పొట్టి దుస్తులు వేసుకోవడం వల్లే మానభంగాలు జరుగుతున్నాయనడం కూడా సరైనది కాదు. పొడుగు దుస్తులు, చీరలు, సల్వార్ కమీజ్‌లు, లెహంగాలు వేసుకుని, శరీరాన్ని తల నుంచి పాదాల దాకా పూర్తిగా కప్పుకున్న మహిళలు ఎప్పుడూ మానభంగానికి గురికాలేదా? అందుకే ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు మంచివి కావు. నా వరకు నేను మతపరమైన గుర్తింపును కోరుకోను. కాబ్‌బ్, బిర్యానీ కానీ… కవిత్వం మీద నా ప్రేమ కానీ కమ్యూనిటీ పరంగా కాకుండా కల్చరల్ పరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
previous post