Vaisaakhi – Pakka Infotainment

చచ్చినోడిని బయటకు ఈడ్చుకొచ్చి శిక్ష వేయించిన బీహార్ మహిళ..

చనిపోయాడన్న వ్యక్తిని బతికించి బయటకు లాగి జైలు గోడలమధ్యకు నెట్టిందో మహిళ. ఈ సంఘటన బీహార్ లోని భాగలాపూర్ లో జరిగింది.. 2018 లో పన్నెండేళ్ల ఒక బాలికపై ఉపాధ్యాయుడు నీరజ్ మోడీ అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఇన్సిడెంట్ నంతా తన కెమెరాలో రికార్డ్ చేశానని, బయటకు చెప్తే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు నీరజ్ మోడీని అరెస్టు చేశారు. అయితే తనకున్న పలుకుబడి తో బెయిల్ పై బయటకు వచ్చాడు. అయినా భాదితురాలి తల్లి తన పోరాటాన్ని ఆపలేదు. అయితే మూడు సంవత్సరాల తరువాత 2022 ఫిబ్రవరి 27న అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మరణించాడని కోర్టు ఈ కేసుని కొట్టివేసింది. తన కొడుకు చనిపోయినట్టు నిందితుడి తండ్రి రాజారామ్ మోడీ కోర్టుకి పత్రాలు సమర్పించి సాక్ష్యంగా దహన సంస్కారానికి సంబంధించిన ఫోటోలు, కర్మ కోసం కొనుగోలు చేసిన కట్టెల రశీదును, మరణ ధృవీకరణ పత్రాన్ని కోర్టు కి సమర్పించాడు.. సాక్ష్యాలను పరిశిలించిన కోర్టు కేసును 2022 మే నెలలో కొట్టివేసింది. అయితే నిందితుడు చనిపోయాడన్న విషయాన్ని విశ్వసించని బాలిక తల్లి నిందితుడు బతికే ఉన్నాడని చనిపోయినట్టు అబద్ధపు సాక్ష్యాలతో కోర్టు ను నమ్మించాడని ఎలాగైనా అతడు బతికే ఉన్నాడని నిరూపించాలనుకుంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగి ఎంక్వైరీ ప్రారంభించింది.. ఒక వ్యక్తి మరణిస్తే చుట్టుపక్కల గ్రామాలకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ నిందితుడైన ఉపాధ్యాయుడి మరణం గురించి చుట్టుపక్కల ఊర్లలో ఎవరికీ తెలియలేదు. ఇంటింటికీ తిరిగి చనిపోయిన విషయాన్ని వాకబు చేసింది.. ఎవరినీ అడిగినా విషయం తెలియదనడం తో నిందితుడు చనిపోలేదు అన్నందుకు ఒక ఆధారం దొరికింది. ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే కర్మలు నిర్వహిస్తారు. కానీ నిందితుడి కుటుంబ సభ్యులు కర్మలు నిర్వహించకపోవడం తో బతికే ఉన్నాడని నిర్ధారించుకుని.. మళ్ళీ కోర్టు తలుపు తట్టింది.. అయితే కోర్టుకు అతను బతికే ఉన్నాడనడానికి సాక్ష్యాలు కావాలని అడిగారు. గ్రామ కౌన్సిల్ నకిలీ పత్రాల ఆధారంగా నిందితుడి మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిందని, దీనిపై దర్యాప్తు చేయాలని పిటిషన్ వేయడం తో కేసు స్పీడందుకుంది. గ్రామ కౌన్సిల్ ను విచారణకు ఆదేశించడంతో నిందితుడి తండ్రిని కొడుకు మరణానికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలను కోరారు. నిందితుడి మరణం తర్వాత తీసిన ఫోటోలు, దహన సంస్కారాలు, మండుతున్న చితి, అంత్యక్రియలు, ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలను గ్రామ సభ సభ్యులు కోరడం తో 250 ఇళ్ళు ఉన్న ఆ గ్రామంలో అందరినీ నిందితుడు చనిపోయాడా? లేదా? అన్న విషయంలోఎంక్వైరీ నిర్వహించారు. అందరూ తమకు తెలియదని చెప్పారు. ఇక ఇంట్లో ఎవరైనా చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకుంటారు. కానీ నిందితుడి కుటుంబ సభ్యులు ఎవరూ గుండు కొట్టించుకోలేదు. అలానే నిందితుడి బంధువులకు కూడా నిందితుడి మరణ వార్త తెలియదు. ఒకేవేళ నిజంగా చనిపోయి ఉంటే ఇంట్లోనే అంత్యక్రియలు నిర్వహించేవారని పోలీసులు తెలిపారు. దీంతో గ్రామ సభ సభ్యులు నిందితుడి తండ్రిని మళ్ళీ ప్రశ్నించారు. అయితే తన కొడుకు మరణించాడనడానికి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించినట్లు తేలింది. చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం కోసం సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితుడి తండ్రిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. తండ్రిని అరెస్టు చేయడంతో నిందితుడు వెలుగులోకి వచ్చాడు. చనిపోయినట్లు ప్రకటించిన 9 నెలల తర్వాత కోర్టులో లొంగిపోయాడు.2022 మే 23 న నిందితుడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కోర్టు రద్దు చేసింది. జూలై 2022లో కోర్టు కేసును మళ్ళీ విచారణ కి తీసుకుని నిందితుడికి పోస్కో చట్టం ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమే కాకుండా బాధితురాలికి రూ. 3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. మరోవైపు కుట్రలో భాగం పంచుకున్న నిందితుడి తండ్రి కి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. న్యాయం కోసం బాధితురాలి తల్లి మూడేళ్ళ శ్రమ తో నిందితులకు శిక్ష పడింది. న్యాయం జరిగింది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More