సూపర్ స్టార్ రజినీకాంత్ – దళపతి విజయ్ ఫ్యాన్స్ మధ్య రచ్చ కొన’సాగు’తునే ఉంది.
మా హీరోనే సూపర్ స్టార్ అంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆ హీరోల పరువును మంట గలుపుతున్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్ గా వెలుగొందిన రజనీకాంత్ తర్వాత జనరేషన్ హీరోల స్పీడ్ తో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవమే. ప్రస్తుతం కోలీవుడ్ లో హీరో విజయ్ కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టే నంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు. అతని దరిదాపులోకి ఎవరు రాలేని పరిస్థితి ఉంది. అతనికి హీరో అజిత్ పోటీ అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం విజయ్ దే పై చేయి. అయితే ఇటీవల తమిళనాడులో జరిగిన జైలర్ మూవీ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలను విజయ్ ఫ్యాన్స్ మనస్థాపం చెందారు. ఇన్ డైరెక్ట్ గా విజయ్ ను ఉద్దేశించి రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో రజనీకాంత్ పై నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కోలీవుడ్లో సూపర్ స్టార్ విజయ్ ఒక్కరేనని, రజనీకాంత్ అతని దరిదాపులలోకి రాలేరని చేస్తున్న వ్యాఖ్యల పై అటు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. కౌంటర్ మెసేజ్ లు పెడుతున్నారు. విజయ్ కోలీవుడ్ స్టార్ మాత్రమేనని రజినీకాంత్ ఇండియన్ సూపర్ స్టార్ అని కౌంటర్ ఇస్తున్నారు. తమిళనాడు తప్పితే పక్క రాష్ట్రంలో విజయ్ ను ఎవరు పట్టించుకోరని, రజనీకాంత్ కు ఇతర ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉందని రజినీకాంత్ తో విజయ్ ను పోల్చ వద్దంటూ రజిని ఫ్యాన్స్ గట్టిగానే సమాధానం చెబుతున్నారు.
అసలు విషయం ఏంటంటే గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరందుకుంది.
సొంతంగా రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అలాగే మరోవైపు బిజెపిలో చేరి ఆ పార్టీ తమిళనాడు సీఎం అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం కూడా సాగింది. తన రాజకీయ అరంగేట్రం పై చాలాసార్లు అభిమానులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకానో దశలో తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ప్రకటన చేసే సమయంలో తీవ్ర అస్వస్థకు లోనై ఆసుపత్రి పాలయ్యారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు నచ్చ చెప్పడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ బీజేపీ మాత్రం రజనీకాంత్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. బిజెపిలోకి చేరాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇదిలా ఉండగా తమిళనాడు బీజేపీ నేతలు – హీరో విజయ్ ల మధ్య ఎప్పటినుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చాలాసార్లు బిజెపి నేతలు విజయ్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్ కూడా కొన్ని సందర్భాలలో తనదైన శైలిలో ఆ పార్టీ నేతలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే త్వరలో విజయ్ ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్తాడనే ప్రచారం సాగుతుంది. అతని తండ్రి ఈ విషయమే ముందుగా మీడియాకు లీక్ చేయడంతో ప్రత్యర్ధులు విజయ్ ను టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఇక విజయ్ తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి తన నిర్ణయం మార్చుకున్నాడు. అయితే సమయం వచ్చినప్పుడు తాను తప్పనిసరిగా ప్రజల కోసం ముందుకు వస్తానని చాలా సందర్భాలలో చెప్పాడు. ఇక రజనీకాంత్ – విజయ్ ల మధ్య నటులుగా కాకుండా పార్టీల పరంగానే గ్యాప్ వచ్చిందనేది వాస్తవం. తనను శత్రువుగా భావిస్తున్న బిజెపి తో రజనీకాంత్ కలిసి ఉండటం విజయ్ అభిమానులకు నచ్చలేదు. ఇటీవల జైలర్ మూవీ ఈవెంట్ లో కూడా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు విజయ్ ను ఉద్దేశించినవే అంటూ ప్రచారం కూడా సాగింది. దీంతో తప్పనిసరి ఇద్దరు అభిమానుల మధ్య వార్ మొదలైంది. కోలీవుడ్లో అసలు సిసలైన సూపర్ స్టార్ విజయ్ మాత్రమేనని అతని అభిమానులు ఘంటా పధంగా చెబుతుంటే రజిని ఉన్నన్నాళ్లు అతని స్థాయిని ఎవరు దాటి వెళ్లలేరని, ఎప్పటికి ఆయనే సూపర్ స్టార్ అని,
ఆయన తర్వాతే ఎవరైనా అంటూ సోషల్ మీడియాలో రజిని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.