మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారికి సకాలంలో సరైన వైద్యం అందక ఎంతోమంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోతున్నారు.. దాతల కొరత కూడా ఈ పరిస్థితి కి కారణం.. అయితే తాజాగా కొందరు వైద్యనిపుణులు మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరటనిచ్చే ప్రకటన ఒకటి చేస్తూ తాము చేసిన ప్రయోగాల ఫలితాలను వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషిలో పంది కిడ్నీ పనిచేస్తోందని అధికారికంగా ప్రకటించారు. కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు పడిందని వెల్లడించారు. అమెరికాలోని న్యూయార్క్లో ఎన్వైయూ లాంగోన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి గత జూలై 14న పంది కిడ్నీని అమర్చారు. అయితే కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని వైద్యులు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. వారు ఊహించిన దానికంటే బ్రెయిన్ డెడ్ అయిన మనిషిలో పంది కిడ్నీ పనిచేస్తోంది. 32 రోజులు అయినప్పటికీ అదిపనిచేసే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని వైద్యులు గుర్తించారు అయితే మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఇన్నిరోజులు పనిచేయడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు. తాజా పరిశోధన ద్వారా మున్ముందు కాలంలో పంది కిడ్నీ మనిషిలో అమర్చే విధానం విజయవంతం అయితే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఊరటనిచ్చే పెద్ద అంశం అవుతుందని ఎన్వైయూ వైద్య బృందం భావిస్తుంది. ఇదిలాఉంటే గతంలోనూ ఇలాంటి ప్రయోగం జరిగింది. కానీ న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మార్పిడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పనిచేశాయి.కానీ జూలైలో చేసిన ప్రయోగం సఫలీకృతం కావడంతో వైద్యులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.బ్రెయిన్ డెడ్ అయిన రోగి శరీరంలో పంది మూత్ర పిండాన్ని అమర్చామని, నెలరోజుల తరువాత ఆ మూత్రపిండం ఎలా పనిచేస్తుందో పరిశీలన చేశామని, రోగికి అమర్చిన అవయవాన్ని తిరస్కరించే సంకేతాలు మాకు కనిపించలేదని వైద్య బృందం పేర్కొంది. అయితే గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని, మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో కూడా చూస్తామని, అందుకోసం మరో రెండు నెలలు కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నామని వైద్యులు తెలిపారు. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చే ప్రక్రియను ప్రారంభిస్తామని వైద్యబృందం వెల్లడించింది.
previous post
next post