Vaisaakhi – Pakka Infotainment

చంద్రగుప్తు ని కాలం నాటి ఉక్కు స్తంభం.. తుప్పు పట్టకుండా ఇప్పటికి అలాగే వుంది..

దాని వయస్సు 1600 ఏళ్ళు. ఎలాంటి వాతావరణం అయిన సరే చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
టూరిస్టులు ఆ ప్రాంతానికి వెళితే కచ్చితంగా దానిని చూసి క్లిక్ మనీ ఫోటోలు తీయాల్సిందే. గత చరిత్రకు ఆనవాలుగా నిలిచిన ఆ ఉక్కు స్తంభం దిల్లీ మెహౌలీలోని కుతుబ్ కాంప్లెక్స్ వద్ద ఉంది. వందల ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఎక్కడా తుప్పు పట్టకుండా ఉండటం విశేషం. ఈ స్తంభం దేశంలోని వేరే ప్రాంతం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారని ప్రచారం ఉంది. ఈ స్తంభంపై చాలా శాసనాలు చెక్కారు. వాటిపై సంస్కృతంలో రాజు చంద్రగుప్త-2 విక్రమాదిత్య పేరు కన్పిస్తుంది. ఆయన 375 నుంచి 415 మధ్య కాలంలో పరిపాలన సాగించాడు. కాబట్టి ఆయనే దీన్ని నిర్మించి ఉంటారని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. 2003లో ఈ ఉక్కు స్తంభం రహస్యాన్ని కొందరు పరిశోధకులు ఛేదించారు. ఐఐటీ కాన్పూర్ కు చెందిన లోహ శాస్త్రవేత్తలు ఆ పరిశోధన గురించి ఓ జర్నల్లో ప్రచురించారు.

ఇది ప్రాచీన భారతదేశంలోని లోహ శాస్త్రవేత్తల నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని అందులో కీర్తించారు. ఈ ఉక్కు స్తంభం ‘మిసావైట్’ అనే రక్షిత పొరను కలిగి ఉందని వెల్లడించారు. మిసావైట్ తయారు కావడానికి ఇనుములో అధికశాతం ఫాస్పరస్ ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న ఇనుములో 0.05 శాతం ఫాస్పరస్ మాత్రమే ఉంటుంది. కానీ, కుతుబ్ మినార్ వద్ద ఏర్పాటు చేసిన స్తంభంలో 1 శాతానికి మించి ఫాస్పరస్ ఉందట. ఈ ఉక్కు స్తంభాన్ని చేతులతో చుట్టేసి కౌగిలించుకుంటే తమకు అదృష్టం కలిసి వస్తుందని కొందరు నమ్మేవారు. అలా కొన్ని సంవత్సరాలపాటు చేయడంతో కింది భాగంలో రంగు పోవడం ప్రారంభమైంది. చాలా పలుచగా ఉండే ‘మిసావైట్’ పొరను పర్యాటకులు తమకు తెలియకుండానే అరిగిపోయేలా చేశారు. జరిగిన తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు స్తంభం చుట్టూ 1997లో రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దిల్లీలో ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ఈ స్తంభం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.ఈ ఉక్కు స్తంభం దాదాపు 7.21 మీటర్ల పొడవుంది. దాని వ్యాసార్థం 41 సెంటీమీటర్లు. బరువు దాదాపు 6వేల కేజీలుంటుందని అంచనా. చారిత్రక ఆధారాల ప్రకారం దీనిని చంద్రగుప్తుడు-2 నిర్మించాడనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. గుప్త వంశంలో ఆయనో గొప్ప రాజు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఇనుప స్తంభం 1600 ఏళ్ల క్రితమే దిల్లీలో ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈ స్తంభాన్ని దిల్లీకి తీసుకొచ్చారనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఇది గుప్తుల కాలం నాటిదని తెలుస్తోంది. అయితే వారిలో ఎవరు నిర్మించారనేది సరిగ్గా తెలియరాలేదు. ఇది హిందువులు దైవం విష్ణువు గౌరవార్థం నిర్మించారని కూడా ప్రచారం సాగుతోంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More