Vaisaakhi – Pakka Infotainment

ఆగస్టు 24న చంద్రుడు పై చంద్రయాన్- 3

చంద్రుడ్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యంగా భారత్ చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం అయింది. ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్‌ మాత్రం చంద్రయాన్‌-1 నుంచి తాజా చంద్రయాన్‌-3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది.అందులో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించేందుకు సిద్ధమైంది. రాకెట్ ఎల్ వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగం మధ్యాహ్నం 2.35 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్‌-3 రాకెట్‌ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఎల్‌వీఎం 3ఎం4 రాకెట్‌ నుంచి శాటిలైట్‌ విజయవంతంగా విడిపోయింది. 24 రోజులపాటు భూ కక్షలోనే చంద్రయాన్‌-3 ప్రదక్షిణ చేయనుంది. ఆ తర్వాత చంద్రుడి వైపు పయనించనుంది. 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగష్టు 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్‌ కానుంది. గతంలో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైన విషయం తెలిసిందే.ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది. చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన తరువాత ఇస్రో దాని వేగాన్ని నియంత్రించలేకపోయింది. ఫలితంగా శరవేగంతో అది ఉపరితలాన్ని ఢీకొట్టి ముక్కలైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు.దీనితో- ఈ ప్రయోగం విఫలమైనట్లు అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. 2019లో చేపట్టిన చంద్రయాన్- 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లనూ చేసింది. వారి అంచనాలకు అనుగుణంగా ప్రారంభం దశలో రాకెట్ ప్రయాణం.. సవ్యంగా సాగింది. దశలవారీగా అన్ని రాకెట్ నుంచి విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకు ల్యాండర్, రోవర్‌లను పంపనున్నారు. దాంతో అన్ని దేశాల చూపూ భారత్‌వైపే ఉంది. అందుకే ఈసారి గురి తప్పొద్దనే పట్టుదలతో ఇస్రో సకల జాగ్రత్తలూ తీసుకుంది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో ఇది చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు సాగించడానికి ఇస్రో దీన్ని ప్రయోగించింది. ఉపరితల వాతావరణం, చంద్రశిలలు, మట్టి నమూనాలను సేకరిస్తుంది. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రయోగంలో హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ భాగమైంది. కూకట్‌పల్లికి చెందిన ఎయిర్‌స్పేస్ అండ్ ప్రెసిసన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చంద్రయాన్ 3కి సంబంధించిన కొన్ని పార్ట్‌లను తయారు చేసింది. ప్రెసిసన్ కంపెనీని డీఎన్ రెడ్డి కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో ఏర్పాటు చేశారు. ఎయిరో స్పేస్ రంగంలో కీలకమైన పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇస్రో గతంలో చేపట్టిన పలు ప్రాజెక్ట్‌ల్లోనూ ఈ కంపెనీ తన వంతు సాయం చేసింది. 1998 నుంచి ఇస్రో ప్రయోగించిన 50 ఉపగ్రహాల్లో పలు కీలక పార్ట్‌లను తయారు చేసింది. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో రోవర్, ల్యాండర్, పొపల్షన్ మాడ్యూల్స్‌లో బ్యాటరీలు పెట్టుకునేందుకు వీలుగా కొన్ని విడి భాగాలను తయారు చేసింది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More