వైకాపా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు వచ్చే ఎన్నికలలో విశాఖ పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది.. ఈనెల 16న అధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో పంచకర్ల చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పెందుర్తి లో బలంగా ఉన్న టిడిపి ఆ నియోజకవర్గం నుంచి జనసేనకు సీటు ఇచ్చే అవకాశం లేనట్లు సమాచారం ఉన్నప్పటికీ రానున్న ఎన్నికలలో టిడిపి-జనసేన- బిజెపి కలిసి పోటీచేసే అవకాశం ఉన్న దృష్ట్యా విశాఖలో కొన్ని సీట్లను జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో టిడిపి ఆ సీట్లను కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే పక్కాగా పెందుర్తి నియోజకవర్గం లో టిడిపి గెలిచాక అవకాశం ఉన్న ఆ నియోజకవర్గాన్ని జనసేన ఆశిస్తుంది అనేది స్పష్టం అవుతుంది. అయితే ఇంకా మూడు పార్టీ ల పొత్తు అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఆ పార్టీల మధ్య చర్చ సాగుతుంది. తుది చర్చల తర్వాత నియోజకవర్గాల కేటాయింపులపై కూడా ప్రకటన ఉంటుంది. అయితే ఇదిలా ఉండగా పంచకర్ల రమేష్ బాబు తొందరపడి నిర్ణయం తీసుకొని రాజీనామా చేశారని వైకాపా నాయకులు చెబుతున్నారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం దృష్టి కి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించానని, కానీ వీలు కాలేదని, ప్రజా సమస్యలు, క్రింది స్థాయిలో సమస్యలను తీర్చ లేనప్పుడు పదవి లో ఉండటం, పార్టీ ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నానని పంచకర్ల రమేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. అధ్యక్షుడు అంటే స్వేచ్ఛయుత పరిస్థితులు ఇవ్వలేదని, చాలా వరకు విమర్శించక పోవడమే నాకు రాదని, సామాజిక వర్గ మీటింగ్ లు పెట్టొద్దని పార్టీ ఆదేశించిందని అన్నారు. తాను వివాదాలకు పోకుండా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టానని, కనీసం పార్టీ అధినాయకత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానీ తన గోడును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ అసంతృప్తితోనే పార్టీని వీడుతున్నట్లు పంచకర్ల వెల్లడించారు. అయితే అంతకుముందే జనసేన పార్టీ నాయకులతో పంచకర్ల టచ్ లో ఉన్నారన్నది వైకాపా నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జనసేన నుంచి టికెట్ హామీ రావడంతో ఆయన వైకాపాని వదిలి వెళ్లిపోయారని విమర్శలు చేస్తున్నారు. పంచకర్ల అయితే ఈనెల 16న అధికారికంగా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. పార్టీ చేరికపై ఆయన నుంచి ఇంకా స్పష్టత రాలేదు. జనసేన నేతలు కూడా ఈ విషయమై స్పందించలేదు. విశాఖ నుంచి వైకాపా నేతలు మరింతమంది జనసేనలో చేరబోతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. పంచకర్ల చేరిక తర్వాత అధికార వైకాపా పార్టీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయన్నది సమాచారం.