విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఓ పెద్దపులి మృతి చెందింది. వృద్ధాప్య కారణంగా అవయవాలు సరిగా సహకరించకపోవడంతో అనారోగ్యంతో మృతి చెందింది. అడవిలో పులి సగటు జీవితకాలం 12-15 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే యానిమల్ రెస్క్యూ సెంటర్ లో సిబ్బంది సంరక్షణలో ఈ పులి 23 సంవత్సరాల వయస్సు వరకు జీవించగలిగింది.2000లో జన్మించిన ఈ రాయల్ బెంగాల్ టైగర్ ను 2007లో ప్రసిద్ధ సర్కస్ నుండి విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తీసుకువచ్చారు. దీనికి కుమారిగా నామకరణం చేసి ఈ పెద్దపులి బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. ఈనెల 24న అర్థరాత్రి సమయంలో యానిమల్ రెస్క్యూ సెంటర్ లో చనిపోయినట్టు విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ డా. నందనీ సలారియా, ప్రజాసంబంధాల అధికారి, అసిస్టెంట్ క్యూరేటర్ టి.సిహెచ్.వి.రమణ అధికారికంగా పులి మృతిని ధృవకరిస్తూ పత్రిక ముఖంగా ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖలోని పశువైద్యుడు, యానిమల్ రెస్క్యూ సెంటర్ సమర్పించిన పోస్ట్మార్టం నివేదిక ప్రకారం, వృద్ధాప్యం కారణంగా మల్టీ ఆర్గాన్ వైఫల్యం కారణంగా కుమారి మృతి చెందినట్టు వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.