ప్రశాంత వధనమో.. ఉగ్ర రూపమో.. అమ్మవారి రూపాన్ని కనులారా గాంచి కోర్కెలు కోరుకుని మొక్కులు చెల్లించుకుని భక్తులు తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు.. కానీ అక్కడ అలా దర్శించుకోడానికి లేదు.. కొలువైన అమ్మవారి కి అసలు శిరస్సు ఉండదు.. శిరస్సు ఉండాల్సిన స్థానంలో ఓంకారం కొలువై ఉంటుంది. ఆ స్థానం లో ఉండాల్సిన శిరస్సు పాదాల దగ్గర ఉంటుంది.. చిత్రంగా ఉంది కదూ.. నిజానికి శిథిల విగ్రహాలు పాడైన దేవతా చిత్ర పటాలు పూజార్హం కాదని పండితులు చెపుతుంటారు.. కానీ చిత్రంగా ఈ దేవత శిరస్సే విరిగిపోయి ఉంటుంది.. పూజలందుకుంటుంది.. ఆలాంటి విశిష్ట దేవత కొలువైన ఆలయం విశాఖపట్నం లోని దొండపర్తిలో ఉంది… ఆ అమ్మవారే ఎరుకుమాంబ అమ్మవారు..సత్యం గల తల్లిగా ఉత్తరాంధ్ర వాసులు ఎరుకమాంబను కొలుస్తారు.గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారు ఇలా దర్శనం ఇవ్వడం వెనుక ఓ కధనం ప్రచారం లో ఉంది. ఏడో శతాబ్దం నుంచి రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న ఇప్పుడు వైర్ లెస్ కాలనీగా పిలువబడుతున్న ప్రాంతంలోనే ఎరుకుమాంబ అమ్మవారు కొలువై ఉండేవారని స్థల పురాణం. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని ఖాళీ చేయించే సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారు. భక్తులు ఎక్కడ ఉంటారో.. తాను కూడా అక్కడే ఉంటానని అమ్మవారు స్వప్న సాక్షాత్కారం ఇవ్వడం తో ఆ కల ప్రకారం దేవత విగ్రహాన్ని ఎడ్ల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే… బండి ఓ చోట ఆగిపోయి ముందుకు సాగలేదట.. అమ్మవారి అజ్ఞానుసారం ఆగిన చోటే ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరు పడిన అమ్మవారి శిరస్సు ఎన్ని సార్లు అతికించిన నిలవలేదు …మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా… శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే.. చల్లగా చూస్తానని ఎరుకుమాంబ చెప్పినట్లు పండితులు చెపుతున్నారు అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం వుంటుందట. ఏ ప్రాంతంలోని అమ్మవారి కైనా చీరలు, పళ్లు, పంచబక్ష పరమాన్నాలను, ఇంకా కోడి మేకపోతుల బలులు ఇవ్వడం మొక్కుకుంటారు. కానీ ఎరుకుమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు…. అడిగిన వరాలు ఇస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.ప్రస్తుతం అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే అమ్మవార్ల పూజలకు మంగళవారం, లేదా శుక్రవారం శ్రేష్టం అమ్మవారికి ప్రీతిపాత్రం.. కానీ ఇక్కడి అమ్మవారికైతే బుధవారం అంటే ఇష్టమైన దినమాట అందుకే బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేస్తారో, వారి కోరికలు తీరుతాయని విశ్వాసం. వివిధ ప్రాంతాల నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ప్రజలక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతలలో ఒకరిగా ఎరుకుమాంబను వ్యవహరిస్తారు. వికలాంగులు స్వస్థత పొందుతారు, వివాహం లేకుండా ఎక్కువ కాలం ఉన్న ఆడపిల్లలు కల్యాణ యోగం పొందుతారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. బుధవారం మాదిరిగానే, ప్రజలు గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఎరుకుమాంబను పూజిస్తారు. ప్రతినెలా మూడో గురువారం ఎరుకుమాంబ ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు.ప్రజల మధ్య ఉన్న వివక్షను తొలగించడానికి, ఎరుకుమాంబ ఆలయానికి ఎవరు వచ్చినా, వారి స్వంత మార్గంలో ఎరుకుమాంబను పూజించుకునే నియమం ఉంది.