అక్షయ తృతీయ అనగానే ఇంట్లో ఆడవాళ్లు బంగారం కొనమనడం మాత్రమే కళ్లముందు మెదులుతుంది.. ఈ అక్షయ తృతీయ కి తప్పకుండా బంగారం కొనండి అన్న వ్యాపార సంస్థల ప్రకటనలూ కనిపిస్తాయి.. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనుక్కోవడమేన.. వాస్తవానికి అక్షయ తృతీయకు బంగారానికి ఎలాంటి సంబంధం లేదు. మార్కెటింగ్ మాయాజాలం లో అక్షయ తృతీయ కి బంగారాన్ని లింక్ చేసేసి ప్రజల మైండ్ సెట్ ని మరి ముఖ్యంగా హిందువుల ఆలోచనల్లోకి బంగారాన్ని ఇరికించేశారు. ఇంకొంత మంది ఒక్కడుగు ముందుకేసి బంగారం కొనుగోలు చేసేందుకు శుభసమయాలను కూడా ముందస్తుగా చెప్పేస్తూ ప్రకటనలు గుప్పించేస్తున్నారు. నిజం గా అక్షయతృతీయ రోజున బంగారం తప్పక కొనాలా? అంటే పండితులు, ప్రవచనకారులు కొనడమే పాపం అని చెప్తున్నారు.. బంగారం లో కలి పురుషుడు నిక్షిప్తమై ఉంటాడని క్షయము కానీ ఆరోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకోవడం అంటే పాపాన్ని కొని తెచ్చుకోవడమే అని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెపుతున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటె శుభకరమని ఏ పురాణాలలో ప్రస్తావించలేదని చెప్తూనే ఆరోజున లేనివారికి ఉదకభాండం, స్వయంపాకం, ద్రవ్యం, చెప్పులు, వస్త్రాలు, గొడుగు ఇలాంటివి దానం ఇస్తే శుభకరమని ఆయన చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మికంగా కొన్ని దేవాలయాలలో విశేష పూజలు అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఆంద్రప్రదేశ్ లో విశేషమైన వైష్ణవాలయం సింహాచలం లో యుగళావతారుడైన వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం స్వామి వారి చందనోత్సవం జరుగుతుంది. అలాగే బృందావనం లోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన బంకే బిహారీ ఆలయం లోని మూలమూర్తి పాదదర్శనం ఈ ఒక్క రోజే లభిస్తుంది. అలాగే యమునోత్రి, గంగోత్రి ఆలయాలు సుదీర్ఘ విరామానంతరం ఇదే రోజు తెరవబడగా బద్రీనాథ్ ఆలయం అక్షయ తృతీయ కు అటూఇటూ గా తెరుస్తారు. తమిళనాడు లోని కుంభకోణం లోని పన్నెండు వైష్ణవాలయాల్లో గరుడ వాహన ఉత్సవం జరుగుతుంది. వీటితోపాటు పూరి రథయాత్ర కు సంభవించి రధాల నిర్మాణం ఇదే రోజు మొదలవుతుంది. వైశాఖ శుద్ధ తృతీయ రోజున పరశురామ జయంతి తో పాటు మరెన్నో విశేషా ఉన్నాయి పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం ఈరోజే కాగా త్రేతాయుగం మొదలైన రోజు కూడా ఇదే వ్యాస మహర్షి మహా భారతాన్ని వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే. అంతే కాకుండా అజ్ఞాతవాసములో వున్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది ఈరోజునే శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకుసంరక్షకునిగా నియమింపబడిన రోజు ఆదిశంకరాచార్యులు కనకధారాస్తవం చెప్పిన రోజు అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన తిధి ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాలు ఉన్న తిధి మాత్రమే అక్షయ తృతీయ బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అన్న ప్రచారంలో నిజం లేదన్నది పండితుల వాదన. ఆరోజు కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి దానికోసం చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మరి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరమని హెచ్చరిస్తున్నారు. కలి పురుషుడి నివాస స్థానాలయిన జూదం, మద్య పానం, మగువ ,ప్రాణి వధ, బంగారం. వీటితో పాటు అసత్యం,గర్వం, కామం, హింస, వైరం. జాగ్రత్తగా పరిశీలిస్తే, అనుషంగికాలైన ఇవన్నీ కలి వెంట నీడలా ఉంటాయి.అక్షయ తృతీయ రోజు వీటి జోలికి వెళ్తే కలి పురుషుడి దుష్ప్రభావం అక్షయంగా వెంటాడి ఉంటుందని గట్టిగానే చెపుతున్నారు
previous post