“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ” హిందూ వివాహాలలో మాంగళ్య ధారణ జరిగే సమయంలో వినిపించే మంత్రం ఇది కేవలం తంతు కోసం వినిపించే మంత్రం కానేకాదు.. రెండు జీవితాలను దృఢంగా నిలిపే దివ్య ఆశీస్సు.. అంతటి గొప్ప ఆశీస్సులతో బంధం ఏర్పరిచే ఆ సూత్రమే మంగళసూత్రం. మాంగళ్యం, తాళి, తాళిబొట్టు, పుస్తెలు, శతమానం, ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఆ సౌభాగ్య చిహ్నమే హిందూ వివాహ తంతులో కనిపించే అతి ముఖ్యమైన అంశమే మాంగల్యధారణ. భారతదేశంలోని హిందూ ధర్మం లొనే ఎన్నో సంప్రదాయాలు… మరెన్నో పద్ధతులు, కట్టుబాట్లు ఉన్నాయి.. వాటిని అనుసరించే వివిధ భాషల్లో పిలిచే పేర్లతో పాటు ఈ మాంగళ్యానికి ఒక్కో సంప్రదాయం లో ఒక్కో రూపం ఉంది. ప్రతి మనిషి జీవితంలో వివాహం ఎంత ముఖ్యమో వివాహ తంతుకి మంగళసూత్రం కూడా అంతే ముఖ్యం. నిజానికి పెళ్లి సమయంలో వరుడు వధువు మెడ లో కట్టే ఆ సూత్రం ఒక గొలుసు లాంటిది.. పసుపుతాడు తో ఇద్దరి జీవితాలను కలిపే సూత్రం . తదనంతరం వారి స్థోమత ను అనుసరించి ఆ సూత్రం బంగారు మయం అవుతుంది. వివాహానంతరం స్త్రీలు మంగళ సూత్రం ధరించే ఈ ఆచారం దేవతా కాలం నుండి ఉన్నప్పటికీ మనకు తెలిసి ఆరో శతాబ్దంలో ఆరంభమయింది. శోభాయమానం, శుభప్రదం అనే అర్థం వచ్చే సంస్కృతం నుండి పుట్టిన ‘మంగళ’ అనే పదంతోనే ఈ పవిత్ర చిహ్నం ఏర్పడింది. అలాగే సూత్రం అంటే తాడు, ఆధారమైనది అన్న అర్ధాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. ఇది భార్యా భర్తల అనుబంధానికి వైవాహిక జీవితానికి శాశ్వత గుర్తు.. ఇది సమస్త కీడు ని తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్మకం. అందుకే అప్పటి కాలంలో… వివాహిత మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించే వారు. కొంతమంది ఫ్యాషన్ కోసమో.. పెళ్లయిందని తెలియకూడదనో.. మెడలో చిరాకుగా ఉందనో తీసి పక్కన పెడుతుంటారు.. కానీ అది అరిష్టమని పండితులు చెపుతున్నారు. ఇక మంగళసూత్రంలో ముత్యం జాతిపగడం ధరించడం వెనుక మన మహర్షులు చెప్పటంలో కూడా విశేషార్ధం దాగి ఉంది. పాతతరం స్త్రీలలో డెలివరీ సమయంలో శస్త్ర చికిత్స అనేది అరుదైన విషయం. కాని ఇప్పడైతే అన్ని డెలివరీలు సిజేరియన్ లే అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోడానికి ముత్యం, పగడం శక్తి నిస్తాయి.. సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు)ను స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రాలను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా స్త్రీలలో వచ్చే రుగ్మతలను దోషాలను తొలగిస్తాయట.. అందుకే చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలదని ఒక విశ్వాసం.. మరో విషయం ఏంటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు మాత్రం కుజుడు.. అందుకే ముందుగా కుజ దోషం ఉన్నదా లేదా అని చూసి మాత్రమే వివాహం చేస్తారు… అందుకే ఒక మహిళ జీవితంలో ఈ మూడు గ్రహాలు అత్యంత కీలకం..వాటిని.. వాటిశక్తిని సంగ్రహించినదే మంగళ సూత్రం.