భూమి పై వుండే ఏడు ఖండాలు తిరిగి ఒక్కటి కానున్నాయా..? టెక్టానిక్ ప్లేట్ల కదలికలతో ఖండాలన్నీ మాయం అవుతాయా..? అంటే అవునని భవిష్యత్తులో అదే జరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భూమితో సహా గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్లు అందరికీ తెలిసిందే. అదేవిధంగా భూమిపై ఉన్న ఏడు ఖండాలు కూడా నిరంతరం టెక్టానిక్ ప్లేట్ల కదలికల ఆధారంగా స్థానభ్రంశం చెందుతున్న అంశం పై ఆస్ట్రేలియాకు చెందిన న్యూ కర్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. సాధారణంగా భూమి ఉపరితల పొరలోని టెక్టానిక్ ప్లేట్లు తరచూ కదులుతూనే ఉంటాయని, ఈ క్రమంలోనే ఖండాలు, ఇతర భూభాగాలు ఉండే చోటు, వాటి ఆకారంలో మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. భవిష్యత్తులో టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల చోటు చేసుకోబోయే పరిణామాల పరిస్థితిని శాస్త్రవేత్తలు ఒక సూపర్ కంప్యూటర్ సాయంతో పరిశీలించారు. భవిష్యత్తులో భూమ్మీద ఏడు ఖండాలు స్థానభ్రంశం చెంది తమ రూపు రేఖలను పూర్తిగా మార్చుకొని అన్నీ కలిసి ఒకే ఖండంగా మారిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద భూభాగాలన్నీ ఒకప్పుడు పాంజియా పేరుతో ఒకే ఖండంగా ఉండేవని భవిష్యత్తులో మళ్లీ ‘అమేషియా’గా ఒకే ఖండంగా మారుతాయని అంటున్నారు. భూమి ఏర్పడి 200 కోట్ల ఏళ్లకుపైనే అవుతోంది. నాటి నుంచీ భూమ్మీద ఉపరితలం పొర కదులుతూనే ఉంది. అయితే అది ఒకేభాగంలా కాకుండా భూమి అంతర్భాగంలోని లావా సముద్రంపై తేలియాడుతున్న ప్లేట్ల తరహాలో ఉంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్లు అంటాం. భూమి పరిభ్రమణం, భ్రమణం ఆధారంగా ప్రతి 50, 60 కోట్ల ఏళ్లకోసారి ఈ కదలికలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలోనే కొత్త ఖండాలు ఏర్పడటం, ఉన్నవి విడిపోవడం వంటివి జరుగుతాయని అంటున్నారు. ఈ లెక్కన మరో 20 కోట్ల ఏళ్లలో పసిఫిక్ మహా సముద్రం మూసుకుపోతుందని ఖండాలన్నీ కలిసి ఒకే అతి పెద్ద ఖండం ఏర్పడుతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు ఆసియాకు దగ్గరగా వచ్చి కలిసిపోతాయని, ఇప్పటికే దగ్గరగా ఉన్న ఆఫ్రికా, ఆస్ట్రేలియా కూడా జత కలుస్తాయని, మొత్తంగా భారీ ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, ఆసియా పేర్లు కలిసేలా ‘అమేషియా’ అని కొత్త ఖండానికి పేరు పెట్టినట్టు తెలిపారు. ఇదంతా జరగడానికి సుమారు 20, 30 కోట్ల ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.