ఇదే నిజమైతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప శుభవార్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వార్తయితే ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు నేతలు ప్రజా సంఘాలు, స్టీల్ ప్లాంట్ యూనియన్ ల తో కలిసి చేస్తున్న పోరాటం ఓ వైపు కొనసాగుతూనే ఉంది. కేంద్రం వెనక్కి తగ్గేవరకు తమ పోరాటం ఆపేది లేదని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఇప్పటికీ నిరవధిక దీక్షలు చేస్తూనే వున్నారు. ఇలాంటి తరుణంలో ప్లాంట్ ప్రైవేటీకరణ లేదన్న వార్త ఎడారిలో ఒయాసిస్ లాంటిదే.. స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో జరిపిన భూ సేకరణకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కొన్ని పాయింట్లు ప్రైవేటీకరణకు అనుకూలంగా లేవని దాని కారణం గానే ప్రస్తుతానికి ప్లాంట్ యధాతథంగా నడపడానికి ఎటువంటి డోకా లేదని ఢిల్లీ సమాచారం. న్యాయ పరమైన అడ్డంకుల వలన దాదాపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్లేనని తెలుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం నిబంధనలకు లోబడి ప్రజలు భూములను ఇవ్వడం జరుగుతుంది. ఆ భూములు ప్రభుత్వం రంగ సంస్థల ఏర్పాటు కోసమే ఉపయోగించాలని ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పగించకూడదన్న నిబంధనే ఈరోజు ప్లాంట్ ను కాపడబోతోందంటూ వార్త చక్కర్లు కొడుతోంది. అదే గనక నిజమైతే ప్రైవేటీకరణకు అసలు అవకాశం లేదనే తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రభుత్వ పెద్దలు కానీ, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. 1971లో 15 వేల ఎకరాల భూమిని సేకరించిన కేంద్ర ప్రభుత్వం. ఎకరాకు రూ.1,200 చొప్పున నిర్వాసితులకు చెల్లించారు. పరిహారం సరిపోదని నిర్వాసితులు ఆందోళన చేయడంతో 1973లో రూ.3,000 ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తరువాత సేకరించిన మరో 11 వేల ఎకరాలకు ఎకరాకు రూ.26 వేల వరకూ పరిహారం చెల్లించారు. నెలిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండయ్యవలస పంచాయతీల పరిధిలోని 64 గ్రామాల్లో సుమారు 26 వేల ఎకరాలు సేకరించారు. అప్పట్లో 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి 107 గజాల స్థలం, నిర్వాసితులుగా గుర్తించే ఆర్-కార్డు ఇచ్చారు. అది గతం మాట.. నిర్మాణానికి తమ విలువైన భూములు ఇచ్చిన నిర్వాసితుల్లో చాలామందికి ఈరోజుకి న్యాయం జరగలేదు. భూములిచ్చి ఉద్యోగం కోసం ఎదురుచూసీ వయస్సు అయిపోయినవారు. తమకు కాకపోయిన తమ పిల్లలకయినా ఉద్యోగం వస్తుంది అని ఎదురుచూస్తున్న టైమ్ లో నష్టాల్లో ఉందనే నెపంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చెప్పిన తరువాత ప్రకటించిన వార్షిక నివేదిక లో వైజాగ్ స్టీల్ లాభాల్లో ఉన్నట్లు తెలిపింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు అప్పజెప్పాలనే ఉద్దేశంతోనే గనులు ఏర్పాటు చేయకుండా నష్టాలు వాటిల్లేల చేసి నష్టాల కారణంతోనే ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విశాఖలో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తే బతుకులు బాగుపడతాయని భావించి ఎంతోమంది తమ జీవనాధారమైన భూములను ఇచ్చారు. కర్మాగారం వస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సభలు పెట్టి చెప్పడంతో నిజమని నమ్మి భూములను అప్పగించారు. గతంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ప్రైవేటీకరణ చేయాలని లేకుంటే తమ చావే గతి అంటూ నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతామంటే ఒప్పుకునేదే లేదని అటు కార్మిక సంఘాల నేతలతోపాటు, ఉద్యోగులు చెబుతున్నారు. రాజకీయ నాయకులూ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రత్యక్షంగా 20 వేలమంది ,పరోక్షంగా మరో 50 వేలమంది ఉపాధి పొందుతున్న ఈ పరిశ్రమ ను ప్రైవేట్ వ్యక్తుల చేతినుంచి అప్పటి నిబంధనలు కవచంలా నిలిచి కాపాడితే అంతకు మించి ఇంకేం కావాలని అంటూనే రూల్స్ మార్చి చేయాలనుకుంటే వాళ్ళు ముందుకే వెళ్తారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ కార్మిక నేత నిర్లిప్తత వ్యక్తం చేయాగ కొంతమంది కార్మికులు మాత్రం ఢిల్లీ లో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్త నిజం కావాలని మొక్కుకుంటున్నారు.
previous post
next post