అప్పులు చెయ్యడం లో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.. అవకాశం ఉన్నచోటల్లా డబ్బులు తెచ్చి ఖర్చుపెడుతున్నాయి.. గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో , తెలంగాణ రెండోస్థానంలో నిలిచాయని కేంద్రం ప్రకటించింది. దేశం మొత్తమ్మీద మరే ఇతర రాష్ట్రం ఈ సౌకర్యాన్ని వినియోగించలేదని లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం గా దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అప్పు రూ.3.98లక్షల కోట్లు కాగా.. తెలంగాణ అప్పు రూ.3.12లక్షల కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. 2018లో ఏపీ అప్పు రూ.2.29లక్షల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో తెలంగాణ రుణం రూ.1.60లక్షల కోట్లే కావడం గమనార్హం. నాలుగేళ్లలో అప్పుల శాతం దాదాపు రెట్టింపు అయినట్లు తెలిపింది. కేంద్రం వెల్లడించిన వివరాలపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సౌకర్యాలు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్ర పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లని వారంటున్నారు. మొత్తం మూడు రకాల రుణ సౌకర్యాలను రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకున్నాయి. కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్‌లో ఏటా పెట్టే వార్షిక పెట్టుబడుల ఆధారంగా స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అప్పుపై రెపోరేటు కంటే 2శాతం తక్కువగా వడ్డీ వసూలు చేస్తారు. ఇదే సౌకర్యాన్ని గవర్నమెంటు సెక్యూరిటీ ఆధారంగా వాడుకుంటే 1శాతం మాత్రమే వడ్డీ విధిస్తారు. వేస్ అండ్ మీన్స్ కింద తీసుకునే అప్పు మూడు నెలల్లోపు కడితే రెపోరేటు ప్రకారం వడ్డీ వసూలు చేస్తారు. తిరిగి చెల్లించే సమయం అంతకు మించితే 1శాతం అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.ఈ రెండు సౌకర్యాలు పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్తాయి. వేస్ అండ్ మీన్స్ కింద అర్హత ఉన్న మొత్తానికి సమానంగా తీసుకుంటే రెపోరేటు 2శాతం, 100శాతానికి మించి తీసుకుంటే 5శాతం వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రోజువారీ అవసరాలకు సరిపోనప్పుడు ఇవి ఆర్బీఐ వద్ద స్వల్పకాలానికి ఈ మూడింటిలో ఏదైనా ఒక సౌకర్యం వినియోగించుకుంటున్నాయని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనాన్షియల్ మిస్ మేనేజి మెంటు చేస్తోందని ఆర్ధిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. భారీ రుణాలు తీసుకోవడం ఆరోగ్యకరమైన ధోరణి కాదని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,98,903.6 కోట్లకు పెరిగిందని కేంద్రప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. 2017-18లో రుణ శాతం 9.8 శాతం తగ్గిందనీ, ఇప్పుడు అది 17.1 శాతానికి పెరిగిందని వివరించింది. తెలంగాణ అప్పుల భారం గత నాలుగేళ్ల కాలంలో రూ.1.6 లక్షల కోట్ల నుంచి రూ.3.12 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. జీఎస్డీపీలో రుణ భారం కూడా పరిమితికి మించి 27.4 శాతంగా ఉంది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల పేరిట ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లు అగ్రగామిగా వున్నాయి. రెండు రాష్ట్రాలలో సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న ఖర్చు, విపరీతంగా పెరిగిన పాలన ఖర్చు వంటి వాటిని పరిశీలించాల్సిన అవసరమున్నా ప్రభుత్వాలు రాజకీయ కారణాల మూలంగా పట్టించుకోవడం లేదని కేంద్రం చెపుతోంది.