హిందూధర్మం లో పశు పక్ష్యాదులకు.. ఆయుధాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. దేవతా మూర్తులు జంతువులను.. పక్షులను వాహనాలు గా.. విశేష ఆయుధాలను చేత ధరించి ఎంతో ప్రాముఖ్యత కల్పించడమే కాకుండా వాటికి పూజార్హత కూడా కల్పించారు. చక్రధారి, అని త్రిశూలధారి, గదాధరుడు అని కీర్తించే విధంగా స్తోత్రాలు కూడా మనకి అందించి వాటి గొప్పతనాన్ని మరింత పెంచారు. ఆలాంటి ఆయుధాలలో కార్తికేయుని చేతిలోని బల్లెం ఆకృతి ఆయుధము అత్యంత విశిష్టమైనది. దీనిని శక్త్యాయుధము అని పిలుస్తారు. “ప్రథమో జ్ఞాన శక్త్యాత్మా” అని ప్రస్తావిస్తూ జ్ఞాన శక్త్యాయుధమని కూడా అంటుంటారు.. ఈ ఆయుధంలో రెండు విశేషాలున్నాయి.ఒకటి జ్ఞానము, రెండు శక్తి నిజానికి జ్ఞానానికే అమితమైన శక్తి ఉంది. అది ఎలాంటిది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానం యొక్క శక్తి. అలాంటి జ్ఞానశక్తి ని ఆయుధం గా ధరించాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయనే గురుస్వరూపుడు. అసుర సంహారం చేసినటువంటి మహా ప్రతాపమూర్తి. “సేనానీనాం అహం స్కందః” అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. సేనానులలో స్కందుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే చెల్లాచెదురైనటు వంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలమై, బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు. అందుకే ఎప్పుడైనా బాధించే అసుర శక్తులు ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికీ, కాలానికీ, వ్యక్తికీ కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటు వంటి వారు సుబ్రహ్మణ్యారాదన విశేషంగా చేయాలి. దీనివల్ల మనల్ని ఇబ్బందులకు గురి చేసే సమస్యలన్నీ తొలగుతాయి. అందుకు ప్రత్యేకించి దేవతలందరూ కూడా దేవసేనాపతి ఆవిర్భావానికి తపన పడ్డారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు శివశాక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది. అసలు బలమే ఆయనయొక్క స్వరూపం. అందుకే సేనాని అయ్యాడు. అందుకు లోక క్షేమంకరమైన శక్తులు చెల్లాచెదురై బలం తగ్గినప్పుడు వాటన్నింటికీ బలాన్నిచ్చి అత్యంత శక్తివంతమైన శక్త్యాయుధదారియై నడిపించేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి గొప్ప నాయకుడు కూడా..అలాంటి సేనానిగా ఎవరైతే నమస్కరిస్తారో వారికి మొత్తం దేవతా సమూహం అంతా కూడా అండగా ఉండి కాపాడుతుందని నమ్మకం.
previous post
next post