విశాఖలోని రుషికొండ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. అక్కడి సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిపోవడంతో కలకలం రేగింది. ఏదో జరగబోతున్నట్లు అక్కడి వారు ఆందోళన చెందారు. గతంలో సునామి సమయంలో, అలాగే హుదూద్ సమయంలో సముద్రం వెనక్కి వెళ్లి మరింత ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొనడంతో ఏదైనా ఉపద్రవం ముంచుకు వస్తుందేమోనని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో అప్పటివరకు మునిగి ఉన్న తీరంలోని చిన్నచిన్న రాళ్లు, ఇసుక మేటలు బయటపడటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య కేరళ లో కూడా కొన్ని రోజుల క్రితం కొన్ని ప్రాంతాల్లో సముద్రం ఇలాగే వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అదే తరహా లో ఆదివారం ఋషికొండ తీర ప్రాంతంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం తుఫాను కొనసాగుతూ ఉండటంతో సముద్రం కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లడం జనం భయానికి మరింత కారణం అయ్యింది. చాలామంది సముద్రం వెనక్కి వెళ్ళడం చూసి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అందరికీ తెలియడంతో తీర ప్రాంతంలో ఏదో జరుగుతుందనే ఆందోళన మొదలైంది. అధికారులు మాత్రం ఎవరు కూడా ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదని చెబుతున్నారు తుపాన్ సమయంలో ఇలాంటి సంఘటనలు సాధారణమే అని మెట్రాలజీ అధికారులు చెపుతున్నప్పటికి ఏదో జరుగుతుందన్న భయం మాత్రం ఇక్కడి వాళ్ళకి పోవడం లేదు.
previous post