Vaisaakhi – Pakka Infotainment

అన్నీ ఆయనకే సాధ్యం..

నిర్మాతల హీరోగా మంచి మనసున్న వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్ ఐతే వెంటనే ఆ నిర్మాతను పిలిచి మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోండి ఫ్రీగా సినిమా చేస్తాను చెప్పడమే కాదు. వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న హీరో అంటూ అప్పటి నిర్మాతలు చెప్పుకునే సూపర్ స్టార్ కృష్ణ (81) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడ్డారు. స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. దీంతో ఆయన్ని వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేసారు. వెంటనే ఎమర్జన్సీ వార్డుకు తరలించి, సీపీఆర్ నిర్వహించారు. ఆ తర్వాత ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. నిపుణులైన డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. కృష్ణ మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన నటుడు ఇక లేడన్న విషయం తెలిసి అభిమానులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇదే ఏడాది జనవరిలో ఆయన పెద్ద కొడుకు రమేష్ మరణించడం వల్ల ఆయన డల్ అయ్యారు. ఈ లోగా ఆయన భార్య ఇందిరా దేవి మరణించారు. మరో ప్రక్క ఆయన తనకి అత్యంత సన్నిహితుడు అయిన బి.ఎ.రాజు దూరమవ్వడం కూడా తీరని లోటు. ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరుగాంచిన ఘట్టమనేని శివరామ కృష్ణ మరణంతో కుటుంబ సభ్యులతో సహా సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ మంచి నటుడు, నిర్మాత, దర్శకులు మాత్రమే కాదు నిర్మాతల పాలిట కల్పవృక్షం మంచి మనసున్న వ్యక్తి సినీ పరిశ్రమలోని 24 క్రాప్ట్స్ పై పట్టు ఉన్న కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో చేయని ప్రయోగం లేదు. తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులుదిద్దుతూ ఆయన పరిచయం చేయని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ బాండ్, కౌబాయ్, 70 ఎమ్ ఎమ్, ఈస్టమన్ కలర్ నుంచి రంగుల సినిమా ఇలా అనేక రకాల జోనర్లను, కొత్త సాంకేతికతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సొంతం బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ ను స్థాపించి అనేక సినిమాలను తెరకెక్కించారు. భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఇప్పటికీ వెండి తెరపై చెరగని ముద్రే. హాలీవుడ్ సినిమా స్టైల్ లో కౌబాయ్ సినిమాల జానర్ తో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో మోసగాళ్ళకు మోసగాడు సినిమా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లోనే తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనే కాదు భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబాయ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో 1971లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది. రిలీజైన ప్రతి భాషలోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సింహాసనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మొదటిసారిగా 70 ఎమ్ ఎమ్ ని పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More