ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఓ భారీ కృష్ణబిలాన్ని (బ్లాక్ హోల్ ) కనుగొన్నారు. అది భూమికి అత్యంత చేరువలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో కనుగొన్న కృష్ణబిలం కంటే ఇది భూమికి మూడు రెట్లు చేరువలో ఉంది. బ్లాక్ హోల్ అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతం. ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే, దాని ఆకర్షణ నుండి, ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ, దాని నుండి తప్పించుకోలేవు. తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కంటే 10 రెట్లు పెద్దది. ఒఫియకస్ నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. ఇది నక్షత్ర ద్రవ్యరాశి విభాగానికి చెందినదని భావిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అసాధారణ అంతరిక్ష భాగాల పరిణామక్రమం గుట్టు విప్పేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. శాస్త్రవేత్తల్లో మరింత ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏమిటంటే పాలపుంతలో నిద్రాణ స్థితిలో ఉన్న బ్లాక్ హోల్ ను స్పష్టంగా గుర్తించడం ఇదే ప్రథమం. నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చితే 5 నుంచి 100 రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని, ఇలాంటివి ఒక్క పాలపుంతలోనే 100 మిలియన్ల వరకు ఉంటాయని భావిస్తున్నారు. ఈ వివరాలు రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ నెలవారీ ప్రచురణల్లో చోటుచేసుకున్నాయి. ఈ కృష్ణబిలంతో పాటు ఉన్న మరో నక్షత్రాన్ని కూడా పరిశోధకులు హవాయిలో ఉన్న జెమినీ నార్త్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. కృష్ణ బిలం ఇతర పదార్థంతో జరిపే చర్య ద్వారానూ, అది వెలువరిచే విద్యుదయస్కాంత వికిరణాన్ని బట్టీ దాని ఉనికిని ఊహించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బ్లాక్ హోల్ లో పడే పదార్థం ఒక ఎక్రీషన్ డిస్క్ లాగా ఏర్పడుతుందని, రాపిడి వలన ఇది విపరీతంగా వేడెక్కి కాంతిని వెలువరిస్తుందని, విశ్వంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోయే వస్తువుల్లో ఇదొకటని చెబుతున్నారు. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌కు దగ్గరగా ప్రయాణించే నక్షత్రాలను అది ముక్కలు చేసేస్తుందని, ఈ ముక్కలు ప్రకాశవంతంగా వెలిగిపోతూ ప్రవాహంలా కృష్ణ బిలంలోకి పడిపోతాయని, కృష్ణ బిలం నక్షత్రాలను ఇలా మింగేస్తుందని వెల్లడిస్తున్నారు.
previous post
next post