ఎప్పుడు అలల రణఘోషతో ఉండే సముద్రం ఉన్నట్టుండి ప్రశాంతంగా మారింది. తీరం వైపు ఉవ్వెత్తున ఎగిసిపడే అలల తాకిడి కనిపించలేదు. నిండు కుండలో తటస్థంగా ఉండే నీటిలా కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేసింది. సుమారు 70 మీటర్ల వెనక్కి సముద్రం వెళ్లిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయందోళన పట్టుకుంది. కొందరు ఆసక్తిగా తిలకిస్తూ ఉంటే, మరి కొందరు ఈ విచిత్ర సంఘటనను తమ మొబైల్ ఫోన్లు ద్వారా చిత్రీకరిస్తున్నారు. మరి కొందరేమో సునామీ వస్తుందేమోనని భయపడి పరిసర ప్రాంతాలను వదిలి దూర ప్రాంతాలకు పరుగులేత్తారు. కేరళలోని కోజికోడ్‌లోని నైనంవలప్పు బీచ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 29 శనివారం సాయంత్రం సముద్రపు నీరు దాదాపు 50 నుంచి 70 మీటర్ల మేర సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. సమీప ప్రాంతాలలో నివసించే వారిలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఆ రాత్రంతా అక్కడ వారికి నిద్ర లేదు. ఏ సమయానికి ఏమి జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నిద్రాహారాలు మాని భయంతో ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి 30 మీటర్ల మేర సముద్రపు నీరు వెళ్లడం ప్రారంభించింది. తర్వాత క్రమంగా 50-70 మీటర్ల వరకు వెళ్ళింది. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సముద్ర గర్భంలోకి వెళ్లవద్దని స్థానికులను హెచ్చరించారు. అయితే అక్కడ పలువురు గుమిగూడడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జనాన్ని చెదరగొట్టారు. కొన్ని గంటలపాటు ఇలాగే కొనసాగింది. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎటువంటి సునామి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపింది. కేరళలోని అనేక ఇతర తీర ప్రాంతాలలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొంది. అంతకుముందు 2017లో కోజికోడ్‌లోని కప్పడ్ బీచ్‌లో ఐదు నుంచి 10 నిమిషాల పాటు సముద్రపు నీరు వెనక్కి వెళ్లిందని తెలిపింది. ఆ సమయంలో సముద్రపు నీరు దాదాపు 100-200 మీటర్ల మేర తగ్గిపోయిందని కొన్ని నిమిషాల పాటు మాత్రమే అలా కొనసాగిందని, అప్పుడు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్థానిక జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. ఆ సమయంలో చీకటిగా ఉన్నందున సముద్రం ఎంత మేరకు వెనక్కి వెళ్ళింది అనేది ఖచ్చితమైన దూరాన్ని కొలవడం సాధ్యం కాదని అన్నారు. కేరళలోని పలు తీరప్రాంతాలలో అప్పుడప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కారణంగానే ప్రతి ఏడాది ఏదో ఒకచోట సముద్రంలో మార్పులు రావడం సాధారణమని పేర్కొన్నారు.