ఇస్రో మరో అద్భుతానికి వేదిక కానుంది. ఇప్పటివరకు ఎన్నో రికార్డులను సృష్టించి భారత ఖ్యాతిని ఇనుమడింపచేసి భారత్ కోసం ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునెలా చేసింది. ఇప్పుడు ఇస్రో మరో రికార్డుకు సిద్ధమవుతోంది. ఒకేసారి 36 ఉపగ్రహాలు ప్రయోగం చేసి మరో సరికొత్త రికార్డును సృష్టించనుంది. ఈనెల 23వ తేదీ భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో రికార్డు స్థాయిలో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బ్రిటిష్ స్టార్టప్ ‘వన్ వెబ్’ సంస్థకు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధం అవుతోంది. గతంలోనే ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్ స్టేషన్ అందుబాటులో లేని కారణంగా అతి పెద్ద షిప్‌లలో భూకేంద్రాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ వెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. వన్ వెబ్ బ్రిటిష్ స్టార్టప్ సంస్థ అయినప్పటికీ ఇందులో మెజారిటీ వాటాలు ఎయిర్టెల్ ప్రమోటర్ అయిన భారతీ ఎంటర్ ప్రైజెస్‌కు ఉన్నాయి. ఏపీలోని శ్రీహరికోట షార్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 22న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రయోగం జరగనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3ని గతంలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని పిలిచేవారు. 36 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ భారీగా వాణిజ్య లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది. కాగా 36 ఉపగ్రహాలు ఒక్కొక్కటి 150 కిలోల బరువు కలిగి ఉండనున్నాయి.
previous post
next post