Vaisaakhi – Pakka Infotainment

ఇళ్ళను అద్దెస్తున్నారా..? బీ కేర్ ఫుల్

ఇళ్లను అద్దెకిచ్చే యజమానులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్నా, ప్రముఖ కంపెనీలకు ఒప్పంద ప్రాతిపదికన సేవలు అందిస్తున్నామని చెప్పినా వివరాలను సరిచూసుకోవాలని పోలీసులు వివరిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణలో పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎక్కువ మొత్తంలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారని ఎక్కువ అద్దె రావడంతో యాజమానులు కూడా అద్దెకి దిగే వారికోసం పెద్దగా ఏమీ విచారించకుండా తమ ఇళ్లను వారికి కిరాయికిచ్చేస్తున్నారని అంటున్నారు. వీరిలో చాలామంది నేరస్తులు, సంఘవిద్రోహకశక్తులు ఉంటున్నట్లు గుర్తించామని వెల్లడిస్తున్నారు. డొల్ల కంపెనీలు, నకిలీ ఏజెన్సీలు మెట్రో నగరాల్లో సైబర్‌, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారు పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఇటీవల బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో కార్యకలాపాలు నిర్వహించకుండా కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు, జనం ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఆ చిరునామా తో డొల్ల కంపెనీలు, నకిలీ ఏజెన్సీలను తెరుస్తున్నారని చెబుతున్నారు. ఇల్లు, ఫ్లాట్‌ కిరాయికి ఇచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలని, ఆధార్‌, ఓటర్‌ గుర్తింపు కార్డులు, బ్యాంక్‌ ఖాతా నకలు ప్రతులు తీసుకోవాలని అంటున్నారు. మోసం చేసేవారు కచ్చితంగా నకిలీవి తయారు చేస్తారని, అంతర్జాలంలో వాటిని సరిపోల్చుకున్నాకే ఫ్లాట్‌, ఇల్లు అద్దెకు ఇవ్వాలని, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సామర్థ్యం, వినియోగ సమయం తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. 24 గంటలు ఇంటర్నెట్‌ వాడుతున్నా, పనిచేస్తున్నట్లు కనిపించినా ఏం చేస్తున్నారని ప్రశ్నించాలని, సైబర్‌ నేరస్థులు ఇల్లు, ఫాట్లలోనే ఎక్కువ సమయం గడిపే అవకాశాలున్నాయని అంటున్నారు. అల్పాహారం, భోజనాన్ని ఆన్‌లైన్‌ డెలివరీ ద్వారా తెప్పించుకుంటారని, ఇలాంటి అంశాలను గమనించి పనిచేస్తున్న కంపెనీ, పనివేళల వివరాలు తెలుసుకోవాలని, యజమాని మరోచోట ఉన్నా తరచూ ఇంటిని సందర్శిస్తూ పర్యవేక్షిస్తుండాలని పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైతే అపార్ట్‌మెంట్‌ లేదా కాలనీ సొసైటీ సభ్యుల, సహ యజమానుల సహకారం తీసుకోవాలని, కాలనీ, అపార్ట్‌మెంటుకు విధి నిర్వహణలో భాగంగా వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌, బ్లూకోల్ట్స్‌ బృందాలతో మాట్లాడాలని, అద్దెకు ఉంటున్న వారిని పిలిచి పోలీస్‌ అధికారులను పరిచయం చేస్తే మోసం చేసే వారిలో కంగారు కనిపించే అవకాశముందని చెబుతున్నారు. ఏదేమైనా ఇటువంటి అసాంఘిక శక్తులు పట్ల ఇళ్లను అద్దెకు ఇచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అటువంటి వారి పట్ల ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More