తనదైన నటనతో విభిన్న శైలితో ఓ ప్రత్యేకముద్రను వేసిన హాస్యనటచక్రవర్తి రాజబాబు. మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే నటవైదుష్యంతో, తోటి మనుషులకు సాయపడే సేవాగుణంతో జీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు. అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు అయిన కోసరు పేరు తో పాపులర్ అయి ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసుకున్నారు..1938 అక్టోబరు 20న నర్సాపురంలో పుణ్య మూర్తుల ఉమామహేశ్వరరావు, రవణమ్మ దంపతులకు జన్మించిన ఆయన తొలుత తెలుగు టీచర్ గా పనిచేశారు. అప్పట్లో సినిమాలకు రావాలంటే నాటకాలలో రాణించాల్సిందే.. అదేం రూల్ గా తీసుకోకపోయినా చిన్నప్పటి నుండి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రస్ట్ తో ‘కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళచావడి’ వంటి నాటకాల్లో నటించి మంచి నటుడుగా పేరుతెచ్చుకున్నారు. ఓ సందర్భంలో నాటి ప్రముఖ దర్శకులు గరికపాటి రాజారావు గారి ప్రోత్సహం తో ఫిలిమ్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి మద్రాస్ వెళ్లిన ఆయనకు అంతవరకు చెప్పిన పాఠాలే సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టాయి. ఆ తరం నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్స్ చెప్పిన రాజబాబు కు తాను తీసిన ‘సమాజం'(1960)చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. డైలాగ్ డెలివరీలో వేగం, దానికి తగ్గట్టుగా అభినయం, రాజబాబు ని ఉన్నత శిఖరాలపై నిలిపాయి.. హాస్యనటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్ గా గుర్తింపు పొందడమే కాకుండా ప్రతి హీరో తమ చిత్రంలో రాజబాబు ఉండాలని కోరుకునేవారట. అందుకే ఇరవై ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు గా 589 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించారు. ఒక్క రమాప్రభతోనే జంటగా 300 సినిమాలు నటించడం కూడా ఓ విశేషం. సినిమా లో హీరో ఎవరో అనుకునే కంటే ముందే రాజబాబు డేట్స్ బ్లాక్ చేసుకునేవారట. నటనే కాకుండ అప్పుడప్పుడు తన గళం వినిపించారు. అది కాకుండా నిర్మాతగా “బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్” పై ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డునపడ్డాడు వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించి, నటించి విమర్శకుల ప్రశంసలు, పురస్కారాలు పొందిన రాజబాబు నిజజీవితంలో వేదాంతి, తాత్విక స్వభావం కలవారు. గతాన్ని మరచిపోకూడదు. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలే జీవితానికి దారిచూపిస్తాయని చాలా గట్టిగా విశ్వసించేవారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి జీవితాన్ని గడిపిన ఆయన ఎందరికో దారి చూపించారు. తన కష్టకాలంలో తన కడుపు నింపిన ఒకామెను గుర్తుపెట్టుకుని ఆమె కొడుకులతో హోటల్ పెట్టించేందుకు సాయపడ్డారు. ఇలా లెక్కలేనన్ని సాయాలు చేసిన ఆయన కోరుకొండలో జూనియర్ కాలేజీని కట్టించారు., రాజమండ్రిలో పేదలకు ఇళ్లస్థలాలను పంచారు. ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డును పొందిన మొదటి హాస్యనటుడు రాజబాబే. 70ప్రాంతాల్లో ఫారిన్ కార్ లో తిరిగిన నటుడాయన. ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఆసుపత్రి స్టాఫ్ కి తెలియకుండా షూటింగ్ లో పాల్గొన్న వ్యక్తి. ”ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు..? మీరు డిశ్చార్జ్ అయ్యాక చేసుకునే వాళ్ళం కదా.. అని డైరెక్టర్ అంటే “నేను ఎంతో మందికి ఎన్నో చేశాను … మీకు ఏమీ చేయలేకపోయాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇలా ” అని తన నిబద్ధత చాటుకున్న మహా మనిషి రాజబాబు. అభ్యుదయ కవి శ్రీశ్రీ కి రాజబాబు తోడల్లుడు. అనుకరణకు అందని నటుడు వాచకంలోను, అభినయంలోను విభిన్న శైలి ఉన్న రాజబాబు 1983 ఫిబ్రవరి14 న కేవలం నలభై ఐదేళ్లకే కన్నుమూశారు.. ఆయన నటించిన చివరి చిత్రం “గడసరి అత్త సొగసరి కోడలు”.
previous post
next post