Vaisaakhi – Pakka Infotainment

పులస కనుమరుగు కానుందా..? తగ్గుతున్న లభ్యత దేనికి సంకేతం.

పుస్తెలు అమ్మయినా సరే పులస తినాల్సిందే అన్నది నాన్ వెజ్ ప్రియులు ముఖ్యంగా గోదావరి జిల్లా వాసుల నినాదం. అయితే సంవత్సరంలో గోదావరి కి వరదలు వచ్చే జులై , ఆగస్టు మాసాల్లో మాత్రమే లభించే ఈ పులస చేప రానున్న రోజుల్లో అంతరించనుందన్న సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి.. గత పది సంవత్సరాలు నుండి చూస్తే క్రమేపీ దీని లభ్యత తగ్గిపోతు వస్తుంది.ఈ సంవత్సరం ఇంతవరకు పులస కనిపించిన దాఖలాలు చాలా అరుదనే చెప్పవచ్చు. అంటే కాల గమనంలో ఈ చేప అదృశ్యం అవుతుంది అనే మాట నిజం కానుందన్నమాట. గోదావరి ప్రాంతంలోని సంప్రదాయ మత్స్యకారులు, మత్స్యరంగ నిపుణులు ఇదే విషయాన్ని దృవీకరిస్తున్నారు. ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో జీవించే ఈ అరుదైన చేప సంతానోత్పత్తి కోసం ఫసిఫిక్ మహా సముద్రం హిందూ మహాసముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. హిల్సా, హిల్సా హెర్రింగ్, ఇలిషా పేర్లతో పిలిచే ఈ చేప మన ప్రాంతం సముద్ర జలాల్లో ఇలస గా వేల కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుని వరదల సమయంలో ఎర్ర నీటి తీపిదనాన్ని ఆస్వాదిస్తూ అంధ్రప్రదేశ్ లో అఖండ గోదావరి ధవళేశ్వరం దిగువన పులసలు గా మారి గోదావరిలోకి ప్రవేశిస్తాయి. వరద గోదావరి ప్రవాహానికి ఎదురీదుకుంటూ ఇవి ముందుకు రావడమే కాకుండా. నదిలోనే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో అనేక మార్పులు సంభవించి తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానాన్ని వృద్ధి చేశాక పిల్లలతో సహా హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోతాయి.ఈ సమయంలోనే ఇవి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి.ప్రస్తుతం అయితే గోదావరి జిల్లాల్లో ఎప్పుడూ లబించే ప్రదేశాలలో పులస జాడ లేకపోవడం విచారకరం. ఏదో ఒకటి రెండో పడినా ధర చుక్కలను అంటు తుంది. ప్రస్తుతం ఒరిస్సాకు చెందిన విలసలని పులసలుగా ఇక్కడ అమ్మెస్తున్నారు. పులసల జాడ తగ్గిపోవడానికి కారణాలు గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా సముద్రం ఇసుక మేటలతో ముసుకు పోవడం వలన ఇలసలు గోదావరి లోనికి స్వేచ్ఛగా వచ్చే అవకాశం తగ్గిపోయింది. దానితో పాటు బంగాళాఖాతం నుండి గోదావరిలోనికి ప్రవేశించే ముఖ ద్వారం వద్ద రిలయన్స్, ఓఎన్‌జీసీ, కెయిర్న్‌ ఎనర్జీ వంటి చమురు సంస్ధలు నిర్విరామంగా చమురు వెలికితీత పనులు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ చమురు సంస్ధల చమురు సహజ వాయువుల అన్వేషణ కోసం జరిపే ప్రయత్నంలో సముద్రంలో ఏర్పడే కంపనాలు వలన పులసలు సమీప ప్రాంతానికి చేరడం లేదు. దీనివలన కూడా వలస పులస జాడ లేకుండా క్రమేపి కనుమరుగవుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి, ధవళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతాలలో నెలకొన్న పరిశ్రమల వ్యర్ధాలను,కాలుష్యపు నీటిని యథేచ్ఛగా గోదావరి లోనికి డంప్ చేసేస్తున్నారు. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు కలసిన ఈ వ్యర్ధాల కాలుష్యం వలన ఇప్పటికే గోదావరి జాతికి చెందిన మత్స్యాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. పునరుత్పత్తి కోసం వచ్చే పులస కాలుష్యం నిండుకున్న చిక్కటి గోదావరి నీటిలో ఎదురీదటం కష్టమవుతుంది. దానితోపాటు లంక భూముల్లో ఆహార పంటలు కన్నా రొయ్యల సాగు లాభసాటిగా ఉండటం చేత బంగాళాఖాతానికి చేరుకునే ప్రతీ గోదావరి పాయల్లో పర్యావరణ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా రొయ్యల సాగు చేపడుతున్నారు.ఈ సేద్యంలో ఉపయోగించే యాంటీ బయటిక్ రసాయన వ్యర్ధాలు అన్నింటిని కూడా గోదావరి కి మళ్లించడం వలన కాలుష్య ఉధృతితో పులసలు గోదావరి ప్రవేశానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది గోదావరి పరివాహక ప్రాంతాలలో నెలకొన్న పంచాయితీలు మున్సిపాలిటీలు తమ ప్రాంతాలలో సేకరించిన పారిశుధ్య వ్యర్ధాలకోసం గోదావరి ఇరువైపులా ఉండే ప్రదేశాలను డంప్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి.దీనివలన వరద సమయంలో ఈ వ్యర్ధాలన్నీ తిరిగి సముద్రానికి చేరుతూ కాలుష్యం తీవ్రమై పులస ప్రవేశాన్నీ పూర్తిగా నిరోధిస్తుంది. దానితో పాటు మితి మీరిన చేపల వేట ఆధునిక బోట్లు, ఆధునిక వలల విచక్షణా రహిత వేట పులస రాకకు తీవ్ర విఘాతం కలుగుతోంది చేపలు పునరుత్పత్తి సమయంలో చేపల వేట నిషేధం విధించినప్పటికి కూడా వేట ఆగడం లేదు.దీనివలన ఇతర అనేక మత్స్య జాతులతో పాటు పులస ఉనికి కూడా ప్రమాదంలో పడింది. గోదావరి వరద ఉధృతి లోనే పులసలు దాదాపు 60 నుండి వంద కిలోమీటర్లు వేగంతో వరద నీటిలో ఎదురీదుతాయి.ఆ ఎదురీత వల్లనే పులసకు అంత రుచి వస్తుంది అయితే గోదావరి ఆనకట్ట నుండి విడుదలైన వరద నీరు లక్ష నుండి మూడు లక్షల క్యూసెక్కుల వరకూ నీటి ప్రవాహం ఉన్నప్పుడే పులస ఎదురీతకు అనుకూలంగా ఉంటుంది. అంతకు మించి వున్నప్పుడు ఎదురీత సాధ్యం కాక వెనుదిరిగే అవకాశాలు ఎక్కువని మత్స్య నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత పరిస్ధితి పరిశీలిస్తే చాలా రోజులు పాటు దాదాపు పది లక్షల క్యూసెక్కలు నీరు సముద్రంలోని విడుదల చేయడం జరిగింది.ఈ కారణం వలన కూడా ప్రస్తుత సమయంలో పులసలు జాడ కనిపించక పోవడానికి ఒక కారణం కావచ్చు. పోలవరం ప్రాజెక్ట్ పై ఫిష్ ల్యాడర్ ఏర్పాటు ప్రతిపాదన సంతోష దాయకం. ఇలస రాక, పులస పోకకు ఎలాంటి ఆటంకం లేకుండా పోలవరం ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటుపై అధ్యయనం బాధ్యతను కొల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్‌ఆర్‌ఐ (సెంట్రల్‌ ఇన్‌ల్యాండ్‌ ఫిషరీష్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. దాని స్వేచ్ఛకు విఘాతం కల్పించకుండా నిర్మిస్తున్న ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.   ఈ ఏర్పాట్లు అన్నీ కూడా పులస చేప గోదావరికి వచ్చిన తరువాత కాపాడే ప్రయత్నం మాత్రమే.అసలు సమస్య ఏమిటంటే సముద్రం నుంచి గోదావరికి పులస ప్రవేశానికి ఉన్న అడ్డంకులను ముందు అధిగమించాలి. ఒక వేళ పులస వచ్చినా సంతానోత్పత్తి సమయంలో వాటిని మితి మీరి వేటాడటం వలన కూడా దాని సంతతి తగ్గిపోతుంది.ఈ ఆటంకాలు అధిగమించకుండా ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ప్రయోజనం శూన్యమనే చెప్పవచ్చు.ప్రస్తుతానికి అయితే పులస చేప త్వరలో అతరించబోయే జాబితాలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More