మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడు తిరిగి రాజకీయాల్లో ఇపుడు ఏక్టివ్ గా మారడంతో పాలక, ప్రతిపక్ష నాయకులు మరింత అప్రమత్తం అయ్యారు. అధికారం ఎక్కడుంటే పంచకర్ల అక్కడే ఉంటాడని, తరచూ పార్టీలు మారుతుంటారని ఆయన ప్రత్యర్ధులు తరచు అంటుంటారు. అయితే అది అలా ఉంచితే అందుబాటులో ఉంటారనే గుడ్ విల్ ఆయనకు ప్రజల్లో ఉంది. గతంలో పెందుర్తి, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గా పనిచేసి ఆయన ప్రస్తుతం వైసీపీ లో కొనసాగుతూ ఇప్పుడు క్రియాశీలకంగా మారాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి బరిలోకి దిగాలంటూ ఆయన అభిమానులు గట్టిగా వత్తిడి తీసుకువస్తున్నారు అందుకు అనుగుణంగానే తన వర్గీయులతో ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలలో కాక పుట్టింది. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే చర్చ మొదలై చివరకు తీవ్ర విమర్శల వరకూ రావడం చూస్తే నియోజకవర్గ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయనే చెప్పాలి. ఎంతలా అంటే ప్రస్తుతం ఆయన అధికార వైసీపీ లో కొనసాగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పంచకర్ల మా పార్టీ నాయకునిగా మేం పరిగణించడం లేదు..ఆయన వెంట వైసీపీ శ్రేణులు తిరగడం లేదు… తెలుగు దేశం, జనసేన వాళ్లే తిరుగుతున్నారని వ్యాఖ్యానించడం కాక రేపింది. వైసీపీ నుంచి కచ్చితంగా ఆయనకు సీటు రాదని అదీప్ రాజ్ చేసిన వాఖ్యలు ఇపుడు నియోజకవర్గం లో దుమారం రేపుతున్నాయి. సో…దీంతో అధికార పార్టీలో వర్గపోరు విషయం బయటపడింది. ఇదిలా ఉండగా తెలుగు దేశం పార్టీలో పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గ నాయకుడు ఒకరు పంచకర్లను పార్టీలోకి రానీయమంటూ పార్టీ శ్రేణులు వద్ద అంటుండటం తో అక్కడ కూడా కాక పుట్టిందనే చెప్పాలి. పార్టీకి ఆది నుంచి సొంత నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేపడుతున్నాం…. ఇపుడు పంచకర్ల వచ్చి ఎగరేసుకుపోతే ఊరుకుంటామా అంటూ చిందులేస్తున్నట్లు భోగట్టా. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ నాయకులు కొందరు పంచకర్లతో టచ్ లో ఉండడం దీనికి కారణం గా తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు పరిస్థితి ఇలా ఉండగా జనసేనకు చెందిన కొందరు నాయకులు పంచకర్లను తమ పార్టీలోకి రావాలంటూ వత్తిడి తీసుకువస్తున్నారు. తమ పార్టీ లోకి వస్తే టిక్కెట్ ఖాయమని, ఒకవేళ దేశం పార్టీ తో పొత్తు కుదిరినా జనసేన పెందుర్తి స్థానాన్ని కోరుతుంది కనుక మీకు ఢోకా లేదని పంచకర్లపై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం. నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు ఉండడమే కాకుండా మిగిలిన రాజకీయ పార్టీలలో కూడా పంచకర్లకు మంచి ఫాలోయింగ్ ఉండడం కలిసొచ్చే అంశం గా చెప్పాలి. అయితే పంచకర్ల ఏం పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే విషయం తెలియాల్సి వుంది.