Vaisaakhi – Pakka Infotainment

బాలయ్య స్ట్రాటజీ టిడిపికి కలిసొచ్చేనా ?

ఎవరిని పెద్దగా పట్టించుకోకుండా తన పనేదో తను చేసుకుపోతున్న నందమూరి బాలకృష్ణలో ఆకస్మికంగా వచ్చిన మార్పు టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఏ విషయం పైన అయిన సరే ముక్కు సూటిగా, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే బాలకృష్ణ తీరు, తరచుగా అభిమానులపై చేయి చేసుకోవడమనే వ్యవహర శైలితో కొంతకాలంగా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతూ వస్తున్నారు. నిజం చెప్పాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో అంతగా ట్రోలింగ్ కు గురవుతున్న ఏకైక హీరో బాలకృష్ణ అనే చెప్పాలి. ” ఆహా ” లో ప్రసారమైన ” అన్ స్టాపబుల్” కార్యక్రమం బాలకృష్ణ లోని మరో కోణాన్ని చూపెట్టింది. అప్పటివరకు ట్రోలింగ్ చేస్తున్న వాళ్లే ఈ కార్యక్రమం తర్వాత ఆయనకు జేజేలు పలకడం కొసమెరుపు. కరోనా థర్డ్ వేవ్ సమయంలో సినిమాలను రిలీజ్ చేసే విషయంలో ధైర్యం చేయలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో బాలకృష్ణ తన అఖండ మూవీని రిలీజ్ చేసి అద్భుత విజయాన్ని సాధించారు. మొదటిసారి బాలకృష్ణ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కుమ్మేసింది. ఈ సినిమా విజయంతో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కు క్యూ కట్టాయి. అటు ” ఆహా “లో ప్రసారం అయినా ” ఆన్ స్టాపబుల్”, ఇటు థియేటర్లలో రిలీజ్ అయిన ” అఖండ ” మూవీ బాలకృష్ణ స్థాయిని అమాంతంగా పెంచేసాయి. అప్పటివరకు ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్న అభిమానులు అలాగే దురభిమానులు కూడా ఆయనకు మరింతగా దగ్గరయ్యారు. ఇక అసలు విషయానికొస్తే అభిమానుల పట్ల ఎప్పుడు దురుసుగా ప్రవర్తించే బాలయ్యలో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. అభిమానుల పట్ల ప్రేమగా వ్యవహరించడం, వారిని ఆత్మీయంగా పలకరించడం, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం, తన అవసరం ఉన్నవారికి సహాయం చేయడం, అవసరం అయితే తనే వారి దగ్గరికి వెళ్లి తను మీకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడం వంటివి చూస్తున్న చాలామంది దురాభిమానులు కూడా ఆయన మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. బాలకృష్ణలో వచ్చిన మార్పు చూసి నందమూరి అభిమానులు కూడా మా బాలయ్య దేవుడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలులో బాలకృష్ణ నూతన చిత్రం షూటింగ్ సందర్భంగా అక్కడ అభిమానులతో ఎంతో సరదాగా ఉన్నారు. బాలకృష్ణను చూసేందుకు లక్షల్లో అక్కడికి అభిమానులు తరలివచ్చారు. కొంతమంది జనాలు వచ్చి విసిగిస్తూ ఉండటంతో ఖచ్చితంగా ఈసారి కూడా బాలకృష్ణ అభిమానులపై దురుసుగా ప్రవర్తిస్తారని అనుకున్నారు అంతా కానీ అవేవీ జరగలేదు. షూటింగ్ విరామం అనంతరం చాలా మంది అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. తనను కలవడానికి వచ్చిన అభిమానుల అందరిని ఆత్మీయంగా పలకరించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాలయ్య గతంలో ఓ అభిమానికి కలుస్తా అని మాటిచ్చారు. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచి వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా వారితో ఆప్యాయంగా మాట్లాడారు. దాంతో బాలయ్య అభిమానులు ‘కొట్టినా, పెట్టినా మా బాలయ్య బాబే’ అంటూ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూల్‌లో జరుగుతుంది. బాలకృష్ణ ప్రజలతో మమేకమై, అభిమానులను బాగా చేరువవుతూ ఉండటం పట్ల టిడిపి శ్రేణులలో కూడా నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. నిజం చెప్పాలంటే టిడిపిలో చంద్రబాబు నాయుడు తర్వాత బాలకృష్ణ నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. పార్టీ అధికారంలోకి ఎప్పటినుంచో ఎన్టీఆర్ వారసులు ముఖ్యమంత్రిగా ఉండాలనే నినాదం కొనసాగుతూనే ఉంది. కానీ బాలకృష్ణ మాత్రం ముఖ్యమంత్రి పదవికి అర్హత గల వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆయన సమర్థ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తాను ముఖ్యమంత్రి రేసులో లేనని స్పష్టంగా చెప్పేశారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో టిడిపి, వైకాపా కంటే జనసేన ముందుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి.అటు అధికార వైకాపా పార్టీ కూడా బలంగానే ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మెజార్టీ సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టిడిపి కూడా జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంది. వైకాపా వైఫల్యాలను ఎండగడుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ధీమాను వ్యక్తం చేస్తుంది. రాజకీయపరంగా ఈ పార్టీల స్త్రార్టజీలను ఓటరు నిశితంగానే గమనిస్తున్నాడు. అయితే ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులలో నంబర్ టూ గా కొనసాగుతూ, ఇటు టిడిపిలో కీలకంగా ఉంటూ వస్తున్న నందమూరి బాలకృష్ణ ప్రజలలోకి వచ్చి వారితో మమేకమైకమవుతూ, అభిమానులకు మరింత చేరువవుతూ టిడిపి కేడర్ లో మరింత జోష్ ను నింపుతున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బాలకృష్ణ స్ట్రాటజీకి చాలామంది ఫిదా అవుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ” అన్ స్టాపబుల్ 2″ కార్యక్రమం కూడా బాలకృష్ణ స్థాయిని మరింత పెంచేది గా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ బాలకృష్ణ తీరులో వచ్చిన మార్పు అభిమానులు సంబరాలు చేసుకునే స్థాయికి వెళ్లిందనేది స్పష్టమవుతుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More