కంటి చూపు చక్కగా.. చెక్కు చెదరకుండా ఉండాలంటే క్యారట్ తినాల్సిందే.. వయసు పెరిగినా కంటి చూపును కాపాడే శక్తి క్యారెట్ కు ఉంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. అదే కంటి ఆరోగ్యాన్ని కాపాడేది. బీటా కెరోటిన్ కేన్సర్ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. బీటా కెరోటిన్ అన్నది ‘విటమిన్ ఏ’కు ముందటి రూపం. శరీర అవసరానికి తగ్గట్టు విటమిన్ ఏగా మారుతుంది. బీటా కెరోటిన్ మాత్రమే కాదు.. క్యారెట్ లో ఆల్ఫా కెరోటిన్, బీటా క్రిప్టోక్సాంథిన్ కూడా ఉంటాయి. వాటిని కెరటాయిడ్స్ అంటారు. ఒక మీడియం సైజు క్యారెట్ లో 4 మిల్లీగ్రాముల బీటా కెరోటిన్ లభిస్తుంది. క్యారెట్ ను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. కెరటాయిడ్స్ తోపాటు, విటమిన్ ఈ, సీ, సిలీనియం, లైకోపీన్, లూటెనిన్, జెక్సాంథిన్ ఉంటాయి. వీటిని యాంటీ ఆక్సిడెంట్లుగా చెబుతారు. డయాబెటీస్ ఉన్న వారు కూడా క్యారెట్ ను పరిమితంగా తీసుకోవచ్చు. ఒకవేళ క్యారెట్ తినడం సాధ్యం కాకపోతే ఒక కప్పు జ్యూస్ తాగొచ్చు. బీట్ రూట్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసుకుని అందులో ఒకటి, రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో కూరలా చేసుకుని కూడా తినొచ్చు. కెరటాయిడ్లు క్యారెట్ తోపాటు గుమ్మడి, బొప్పాయి, టమాటా, చిలగడదుంపలోనూ లభిస్తాయి.