ఇంట్లో కంటే ఎక్కువ ప్రసాద్ లాబ్ లోనే తన జీవితాన్ని గడిపిన టెక్నిషియన్ ఎడిటర్ గౌతమ్ రాజు కు ఇప్పుడే శాశ్వత విశ్రాంతి దొరికింది. ఆయన ఎక్కువ ఇష్టపడే సినిమా రంగాన్ని వదిలేసి మంగళవారం రాత్రి కన్ను మూశారు.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఈ విషాధవార్త వినాల్సి వచ్చింది.. ఆయన గురించి ఇండస్ట్రీలో ఒక మాట ప్రతిఒక్కరూ అంటుంటారు, ఆయన కేవలం సినిమా కోసమే పుట్టారు..ఆయన పని మొదలుపెడితే నిద్రాహారాలు మర్చిపోయి మరీ అదే పనిలో ఉంటారు. సినిమా స్క్రీన్ ప్లే ని తన ఎడిటింగ్ తో మ్యాజిక్ చేసిన గొప్ప ఎడిటర్. పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా అందరికీ ఒకేలా తన పనితనం చూపించేవారు. 1954 జనవరి 15న మద్రాసులో జన్మించిన ఆయన ఫిల్మ్ ఎడిటింగ్ కెరీర్ దేఖ్ ఖబర్ రఖ్ నాజర్ (1982)తో ప్రారంభమైంది అప్పటి నుండి పరిశ్రమలో అత్యుత్తమ ఎడిటర్‌గా తన 28 సంవత్సరాల కెరీర్‌లో దాదాపు గా 800కి పైగా చిత్రాలకు కూర్పు ని అందించారు.. తొలి చిత్రాలలో కారు దిద్దిన కాపురం, ప్రేమ్ సామ్రాట్, కర్తవ్యం ఠాగూర్, పొలిటికల్ రౌడీ, అన్నవరం, అశోక్, ఏక్ నిరంజన్ చిత్రాలలో ఆయన చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. 2002లో, ఆది చిత్రానికి ఎడిటింగ్‌కు గాను నంది అవార్డును అందుకున్నారు. కిక్ 2, గోపాల గోపాల , రామయ్యా వస్తావయ్యా, దళపతి, గబ్బర్ సింగ్ మరియు రేస్ గుర్రం వంటి అనేక చిత్రాలలో అతని పనితనానికి విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్ రాజు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.